BJP : మాధవుడికి పెను సవాళ్లు.. సీమలో నేతలు సహకరిస్తారా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది. రాయలసీమలో ఆయన తన తొలి పర్యటనలు ప్రారంభించనున్నారు. తొలుత కడప జిల్లా నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. రాయలసీమలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో మాధవ్ పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేపట్టిన తర్వాత తొలి పర్యటనకు మాధవ్ వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. కడపలో తొలి పర్యటన కావడంతో ఆయన పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారీగా పార్టీ కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ బలోపేతం దిశగా...
రాయలసీమలో పార్టీ బలోపేతం దిశగా మాధవ్ పర్యటన కొనసాగుతుందని అంటున్నారు. అయితే మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలో పార్టీకి పెద్దగా పట్టు లేకపోయినా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎక్కువగా ఉన్నారు. ఆదినారాయణరెడ్డి, టీజీ వెంకటేశ్ తో పాటు అనేక మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలున్నారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడంపై ఆయన దృష్టి పెట్టారని చెబుతున్నారు. అక్కడ ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డికి, తాడపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఫ్లై యాష్ వివాదం కూడా తలెత్తింది.
అనేక నియోజకవర్గాల్లో...
దీంతో పాటు ఆదోని వంటి నియోజకవర్గాల్లో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధికి, స్థానిక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు మధ్య పొసగడం లేదు. జనసేన, బీజేపీ నేతలకు కూడా అనేక నియోజకవర్గాల్లో పడటం లేదు. చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అనంతపురం జిల్లాలోనూ హిందూపురం వంటి నియోజకవర్గాల్లోనే కూటమి నేతల మధ్య సఖ్యత లేదు. ఇలా రాయలసీమలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అదే సమయంలో తమను అధికారంలో ఉన్న టీడీపీ లెక్క చేయడం లేదని బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాధవ్ రాయలసీమ పర్యటన ఏ మేరకు సాగుతుందన్నది చూడాల్సి ఉంది. అయితే మాధవ్ సౌమ్యుడిగా పేరుంది. తొలి నుంచి పార్టీలో ఉన్న నేతలకు, మధ్యలో వచ్చిన నాయకుల మధ్య ఉన్న గ్యాప్ ను మాధవ్ సున్నితంగా ఎలా చెరిపేస్తారన్నది చూడాల్సి ఉంది.