Weather Report : ఎండలు ముదిరిపోతున్నాయ్.. ఇక చెమటలు కక్కాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఇంత భారీగా గతంలో ఫిబ్రవరిలో ఎండలు ఈ స్థాయిలో తీవ్రత లేదని వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతల స్థాయి మరింత పెరిగే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు. యాభై డిగ్రీలకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని, అందుకే ప్రయాణాలు మానుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు, చిరు వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలో ఇలా...
ఆంధ్రప్రదేశ్ లో 35 డిగ్రీలకుపైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా సి. బెలగల్ లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఫిబ్రవరిలోనే ఎండాకాలం వచ్చేసిందని చెబుతున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...
అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరింత తీవ్రత పెరిగే అవకాశమున్నందున బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండటం మంచిదని చెబుతున్నారు. అదే సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా తగినంత నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయలు, తాటిముంజలు వంటి వాటిని తింటే కొంత వరకూ చల్లదనం శరీరానికి చేకూరుతుందని, వీలయినంత వరకూ ఈ వేసవిలో మాంసాహారం తీసుకోకపోవడమే మంచిదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మేనెలలో మరింత ఎండలు ముదిరిపోనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.