Andhra Pradesh : పదవీ గండం పొంచి ఉందనే యాక్టివ్ అయినట్లుందిగా?

కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్ల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొందరు మంత్రుల్లో టెన్షన్ ఎక్కువగా ఉంది

Update: 2026-01-12 07:00 GMT

కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్ల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొందరు మంత్రుల్లో టెన్షన్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇద్దరు మంత్రుల్లో టెన్షన్ ఎక్కువగా కనపడుతుంది. ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఏ విషయంలోనూ వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటి వరకూ కొంత మౌనంగా ఉన్నప్పటికీ త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో తమ పదవికి గండం ఏర్పడుతుందనుకున్నారో.. ఏమో..ఈ ఇద్దరు మాత్రం తరచూ మీడియాలో కనిపిస్తున్నారు. ప్రధానంగా విపక్ష నేత వైఎస్ జగన్ పై విమర్శలు చేయడంలో వీరిద్దరూ ముందుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ వంగలపూడి అనిత లేకుంటే.. నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు వంటి వారు మాత్రమే ఎక్కువ విమర్శలు చేసేవారు. ఇక నారాయణ సరేసరి.

నెల్లూరులో అనేక మంది...
తాజాగా ఈ జాబితాలోకి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవిత చేరిపోయారు. ఏవిషయంలోనూ వీరు వెనక్కు తగ్గకుండా తాము జగన్ ను విమర్శించడంలో ముందున్నామని చెప్పకనే చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి దేవదాయ శాఖ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఆయన శాఖపై మాత్రమే స్పందించేవారు. కానీ మంత్రివర్గ విస్తరణలో ఆనం ను తప్పించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కానీ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరొకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి ఆనంను తప్పించి వీరిలో ఒకరికి చంద్రబాబు కేబినెట్ లో స్థానం కల్పించే ఛాన్స్ ఉందన్న ప్రచారం తో ఆనం అలెర్ట్ అయినట్లు కనపడుతుంది.
అనంతపురం జిల్లాకు చెంది...
ఇక మరొక మంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సవిత కూడా ఈ మధ్య కాలంలో యాక్టివ్ గా ఉన్నారు. సవిత నిన్న మొన్నటి వరకూ పెద్దగా మీడియాలోకనిపించలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత పదవికి గండం పొంచి ఉందని ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో సీనియర్ నేతలున్నప్పటికీ వారిని కాదని కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సవితకు తొలిదఫా లో మంత్రి పదవి లభించింది. అయితే ఆమె కొన్ని వివాదాలకు కూడా కారణమయ్యారు. సవిత పనితీరుపై పార్టీ నాయకత్వం కూడా గత కొంత కాలంగా సంతృప్తి కరంగా లేకపోవడంతో ఆమెను కేబినెట్ నుంచి విస్తరణలో తప్పిస్తారని అంటున్నారు. సవిత స్థానంలో కాల్వ శ్రీనివాసులు పేరు వినిపిస్తుంది. పయ్యావుల కేశవ్ ను అలాగే ఉంచి సవితను తప్పిస్తారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుండటంతో ఆఆమె కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. మరి చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.


Tags:    

Similar News