మరోసారి వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

తాజాగా మహబూబాబాద్ - గార్ల రైల్వే స్టేషన్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి వందేభారత్ రైలుపై రాళ్లదాడి చేశారు

Update: 2023-02-10 13:22 GMT

వందేభారత్ రైళ్లు చూడముచ్చటగా ఉంటాయి. వేగంలోనూ వాటికి మించినవి మరేవీ లేవు. కాస్త ఛార్జీలు అధికంగా ఉన్నా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి దక్షిణమధ్య రైల్వే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలో అనేక చోట్ల ఈరైళ్లు పట్టాలపై పరుగులు తీయడం ప్రారంభించాయి. అయితే ఈ రైళ్లకు ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంది. ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైళ్ల అద్దాలను ఆకతాయిలు రాళ్లతో పగలకొట్టడం అనేక సార్లు జరిగింది.

వరసగా...
నిందితులను గుర్తించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని శిక్షించినా ఫలితం లేదు. వరసగా వందేభారత్ రైళ్లపై రాళ్లదాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య తిరిగే వందేభారత్ రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేయడం ఇది మూడోసారి. ఒకసారి విశాఖపట్నంలో, మరొకసారి ఖమ్మంలోనూ రాళ్ల దాడి జరిగింది.
తాజాగా...
తాజాగా మహబూబాబాద్ - గార్ల రైల్వే స్టేషన్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి వందేభారత్ రైలుపై రాళ్లదాడి చేశారు. దీంతో ఒక బోగీలోని రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమయిన రైల్వే పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.


Tags:    

Similar News