Ambati Rambabu : ట్రాక్ రికార్డు లేని చోట అంబటి స్టెప్పులు ఎందుకో?
వైసీపీ నేత అంబటి రాంబాబు సత్తెన పల్లి నుంచి రిలీవ్ అయినట్లే
వైసీపీ నేత అంబటి రాంబాబు సత్తెన పల్లి నుంచి రిలీవ్ అయినట్లే. సత్తెనపల్లిలో వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు పోటీ చేయరు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. ఈసారి అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అధినాయకత్వం ఆయనకు స్పష్టం చేయడంతోనే ఆయన సత్తెనపల్లికి దూరమై.. గుంటూరుకు దగ్గరయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ అంబటి రాంబాబును ఆదేశించారు. దీంతో ఆయన సంక్రాంతి పండగను గుంటూరులోనే జరుపుకున్నారు. గుంటూరులో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గత ఏడాది కూడా సత్తెన పల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అంబటి ఈసారి మాత్రం గుంటూరులో జరుపుకున్నారు.
గెలుపు లేని చోట...
ఈ సందర్భంగా అంబటి రాంబాబు కూడా తాను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయనున్నానని, అందుకే తాను ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటానని చెప్పారు. సత్తెనపల్లి నుంచి గుంటూరుకు అంబటి రాంబాబును మార్చారంటే అందుకు బలమైన కారణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన అంబటి రాంబాబు, మంత్రి వర్గ విస్తరణ లో అతికీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. సత్తెనపల్లిలో మరొక కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని జగన్ అంబటి రాంబాబును గుంటూరుకు మార్చారన్నది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే అంబటి రాంబాబు ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని భావించి ఆయనను అక్కడకు పంపారన్నది కూడా చర్చ సాగుతుంది.
అన్ని వర్గాల నేతలను...
2009లో ఏర్పడిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మూడు సార్లు విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దాలగిరి, 2024 లో టీడీపీ నుంచి గల్లా మాధవిలు పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ మూడు సార్లు గెలిచిన నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు ను పోటీ చేయిస్తున్నారంటే ఆయన పై జగన్ కు ఉన్న నమ్మకమా? లేదా? అన్నది ఫలితాల తర్వాత తెలియనుంది. 2019 లో జగన్ ప్రభంజనంలోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరలేదు. 2019 చంద్రగిరి ఏసురత్నం, 2024లో విడదల రజనికి బరిలోకి దింపినా అక్కడ ఫ్యాన్ పార్టీ గెలుపొందలేదు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు దఫాలు వివిధ సామాజికవర్గాలను గెలిపిస్తుండటంతో ఈసారి అంబటిని గుంటూరుకు షిఫ్ట్ చేశారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది.