Amanchi : ఆమంచి ఆలోచనలో పడ్డారా? ఏ పార్టీలో చేరి ఈసారి పోటీ చేస్తారు?
ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమయింది
ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మల పర్యటనలో ఆమంచి కృష్ణమోహన్ కనిపించినా ఎన్నికల సమయానికి ఆయన పార్టీ మారే అవకాశాలు లేకపోలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఆయన తొలుత ఇండిపెండెంట్ గా, తర్వాత కాంగ్రెస్ లోనూ, ఆ తర్వాత టీడీపీలోనూ, అనంతరం వైసీపీలోకి వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంలో బలమైననేతగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మరోసారిపార్టీ మారేందుకుసిద్ధమవుతున్నారని తెలిసింది.
బలమైన నేత కావడంతో...
ఆమంచి కృష్ణమోహన్ బలమైన సామాజికవర్గం నేతగా చీరాల నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. రెండుసార్లు గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన టీడీపీకి చేరువయ్యారు. అయితే మళ్లీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన వైసీపీ పంచన చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఇక్కడి నుంచి ఓటమి పాలయ్యారు. ఈసారి టిక్కెట్ రాకపోవడంతో పాటు పర్చూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. కొంతకాలం అక్కడ పనిచేసి తనకు చీరాల సీటును ఇవ్వాలని ఆయన అధినాయకత్వాన్ని కోరారు. కానీ వైసీపీ హైకమాండ్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరారు.
వైసీపీలో చేరేందుకు...
అయితే ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ కు రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి జనసేన కాగా, మరొకటి వైసీపీయే. కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు వెంకటేశ్ ను అద్దంకి నియోజకవర్గం ఇన్ ఛార్జిగా వైసీపీ అధినేత జగన్ నియమించడంతో ఇప్పుడు వైసీపీలో చీరాల సీటు ఖాళీగా ఉంది. దీంతో తిరిగి వైసీపీలోకి చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరొకవైపు జనసేనలో చేరి టిక్కెట్ సాధించడం. అయితే అది టీడీపీ సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా టీడీపీయే అక్కడ పోటీ చేసే అవకాశాలున్నాయి. టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ ఎంట్రీకి అవకాశాలు లేవు. దీంతో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు.
జగన్ కూడా...
ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినా జగన్ చేర్చుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే బలమైన నేత కావడంతో ఆయన చేరికకు అభ్యంతరం చెప్పకపోవచ్చు. మరొకవైపు చీరాలలో సరైన నాయకుడు వైసీపీకి లేరు. దీంతో జగన్ ఆమంచి కృష్ణమోహన్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో పోటీ చేసి తిరిగి ఓటమిని కొని తెచ్చుకోవడం కంటే వైసీపీలో చేరి మరొకసారి చీరాలలో తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయించుకున్నట్లు బలమైన టాక్ వినపడుతుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.