TDP : ఈ సీనియర్ నేతకు ఏమయింది? ఎందుకంత సైలెన్స్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కొందరు కీలక నేతలు మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. అందులో అమర్ నాధ్ రెడ్డి ఒకరు

Update: 2025-08-11 08:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కొందరు కీలక నేతలు మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరూ సైలెంట్ గా మారిపోయారు. అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనూ కీలకమైన నేతలు సైలెంట్ గా ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆ నేతలు చివరకు ఛాన్స్ దక్కకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహలోనే ఉన్నారని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మినహా మరే సందర్బంలో వీరు పెద్దగా కనిపించడం లేదు. అలాగే విపక్షాలు చేసే విమర్శలకు సయితం కౌంటర్లు ఇవ్వడం లేదు.

ఎన్నికలకు ముందు...
అందులోనూ ముఖ్యంగా మాజీ మంత్రి ఎన్. అమర్ నాధ్ రెడ్డి అస్సలు కనిపించడమే మానేశారు. ఎన్నికలకు ముందు జోరుగా, హుషారుగా కనిపించిన అమర్ నాధ్ రెడ్డి చివరకు సైలెంట్ గా మారారు. 1996లో పుంగనూరు నియోజకవర్గంకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. యన 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై, 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన డీసీసీబీ ఛైర్మన్‌గా, టీడీపీ పార్టీలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
వైసీపీ నుంచి టీడీపీకి చేరి...
ఎన్. అమర్ నాధ్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.తర్వాత జూన్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి టీడీపీలో చేరాడు. ఎన్. అమర్ నాధ్ రెడ్డి 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 ఏప్రిల్ 2017న పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్. వెంకట గౌడ చేతిలో ఓడిపోయారు. 2024లో ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి విజయం సాధించారు.
ఎలా చూసినా...?
సామాజికవర్గం పరంగా చూసినా, పార్టీలో ఎన్. అమర్ నాధ్ రెడ్డి కి ఉన్న ట్రాక్ రికార్డును చూసిన తర్వాత ఆయనకే కాదు.. టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అని ఎవరైనా అనుకుంటారు. అందులోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మృతి చెందడంతో రెడ్డి సామాజికవర్గం కోటాలోనూ, సీనియారిటీలోనూ తనకే మంత్రి పదవి దక్కుతుందని ఎన్. అమర్ నాధ్ రెడ్డి ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారు. అందుకేనేమో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఒకింత అసహనం కూడా తన అనుచరుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద ఎన్. అమర్ నాధ్ రెడ్డి సైలెన్స్ మాత్రం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.


Tags:    

Similar News