Ap Politics : ఇక కూటమి కుదురుకున్నట్లేనా.. జగన్ కు మరోసారి దెబ్బ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కుదురుకున్నట్లే కనిపిస్తుంది. ఇక జగన్ పార్టీకి చుక్కలు కనపడతాయని చెప్పక తప్పదు

Update: 2025-01-18 06:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కుదురుకున్నట్లే కనిపిస్తుంది. వరసగా కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో ఇక జగన్ పార్టీకి చుక్కలు కనపడతాయని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వం క్రమంగా బలం పుంజుకుంటోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి అమలు చేసినా గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువ సమస్యలను పరిష్కరించేందుకు కూటమి సర్కార్ కు ఒక అవకాశం లభించినట్లయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజీ తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయినట్లే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ సాధ్యం కాని విధంగా దాదాపు 11,447 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆషామాషీ కాదు.

కేంద్రంలో బలం లేకపోవడంతో...
ఒకరకంగా చంద్రబాబు మంచి ముహూర్తంలో కూటమి ఏర్పాటుకు బీజం వేశారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి సరైన స్థానాలు లభించకపోవడం, చంద్రబాబు పార్టీపై ఆధారపడటం కూడా ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూరుతుంది. ప్రధాన సమస్యలకు పరిష్కారం సులువుగా లభించడానికి కేవలం అదే మార్గాన్ని సుగమం చేసిందనే చెప్పాలి. లేకుంటే మోదీ ఎప్పుడు తలొగ్గాలి? అందునా దక్షిణ భారత దేశంలో ఉన్న బీజేపీ అస్సలు లేని రాష్ట్రానికి ఇంత సాయం చేస్తారని భావించడమూ కల్లే అవుతుందన్నది ఆ పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. కానీ ఇప్పుడు తప్పదు. కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో ఉండాలంటే చంద్రబాబు మద్దతు తప్పనిసరి.
పట్టుదలకు పోకుండా...
చంద్రబాబు కూడా గతంలో మాదిరిగా పట్టుదలకు పోవడం లేదు. పట్టువిడుపులను ప్రదర్శిస్తున్నారు. మోదీ పట్ల, బీజేపీ పట్ల విధేయత ప్రదర్శిస్తూనే తాను సాధించాల్సిన అన్నింటినీ తెచ్చుకుంటున్నారు. మోదీని మంచితనంతోనే మన వైపు తిప్పు కోవచ్చని చంద్రబాబు ఒకరకంగా నిరూపించారనుకోవాల్సిందే. రాజధాని అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీ.. ఇలా ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ పెద్దయెత్తున నిధులను ఆంధ్రప్రదేశ్ కు తేవడంలో నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చాలా వరకూ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఇంతకంటే కావాల్సిందేముంది?
కీలక సమస్యలను పరిష్కరించడానికి...
దీంతో పాటు మరికొన్ని కీలక సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకునేంత శక్తిని చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చినట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సరైన స్థానాలు రాకపోవడమే మనకు మంచిదయింది. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన ఖేల్ ఖతం అయినట్లే. అంటే ఇప్పుడిప్పుడే కోలుకోలేని పరిస్థితులు జగన్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ బ్యాడ్ లక్. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు కేంద్రంలో ఈ పరిస్థితి లేదు. నాడు జగన్ కు శాసించే పరిస్థితి లేదు. యాచించినా ప్రయోజనం లేదని తెలుసు. అందుకే జగన్ సక్సెస్ కాలేకపోయారు. కానీ చంద్రబాబు కు అదృష్టం మామూలుగా పట్టలేదు. అందుకే ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. సో.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి కష్టాలే. చంద్రబాబు సామర్థ్యానికి మరోసారి జనం జై కొట్టడానికి సిద్ధమవుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News