YSRCP : ఆళ్ల మళ్లీ ఆట మొదలు పెట్టారా?

ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు

Update: 2026-02-26 06:54 GMT

ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు. వైసీపీలో ఆయన తిరిగి క్రియాశీలకంగా మారడం మంగళగిరి నియోజకవర్గంలో కొంత ఊపు తెచ్చినట్లు కనపడుతుంది. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టును ఆశ్రయించడంతో పాటు చంద్రబాబు, లోకేశ్ ను ఇందులో ప్రతివాదులుగా చేర్చడం కూడా ఆయన మరోసారి పోరుకు సిద్ధమయినట్లు కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఇన్ యాక్టివ్ గా కనిపిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు కేసులతో అందులోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరును ప్రారంభించడంతో తిరిగి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

కొన్నాళ్లుగా దూరంగా...
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోవ్యాపారాలకు, వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యారు.అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న అనుమానం కూడా ఒక దశలో కలిగింది. 2019 ఎన్నికలకు ముందే తాను ఎన్నికల్లో పోటీ చేయనని వైఎస్ జగన్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అయితే నాడు కాదంటూ జగన్ వారించడంతో తప్పనిసరి స్థితిలో పోటీకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ లో చేరి తిరిగి వైసీపీలో చేరినా యాక్టివ్ గా లేరు.
వరసగా రెండు సార్లు గెలిచి...
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై విజయం సాధించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు వేశారు. సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. 2024 ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేయలేదు. మురుగుడు లావణ్యకు జగన్ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఈసారి తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని కూడా మంగళగిరిలో ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మారతారని భావించినా ఆయన మాత్రం తిరిగి మంగళగిరి నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


Tags:    

Similar News