Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ పొలిటికల్ స్కెచ్ అదిరిందిగా?
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పొలిటికల్ స్కెచ్ ను మార్చి రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పొలిటికల్ స్కెచ్ ను మార్చి రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. భూమా ఫ్యామిలీ ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వారి అడుగులు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా పక్కన పెట్టేసి తన కుటుంబానికే పట్టుదక్కించుకునేలా సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ కొనసాగుతున్నారు. అయితే నంద్యాల నియోజకవర్గానికి వచ్చే సరికి గత ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ దక్కలేదు. నంద్యాల టిక్కెట్ ను ఎన్.ఎం.డి ఫరూక్ కు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్.ఎం.డి ఫరూక్ కు చంద్రబాబు తన కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.
గత ఎన్నికల సమయంలో...
అయితే గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నినాదాన్ని తెచ్చింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పద్ధతిని అవలంబించింది. జేసీ సోదరులు, కేఈ కుటుంబానికి, పరిటాల ఫ్యామిలీకి ఒక కుటుంబంలో ఒకరికే సీటు నిర్ణయంతో ఒకరికే సీటు దక్కింది. దీంతో భూమా కుటుంబానికి కూడా ఆ సమయంలో సీటు దక్కలేదు. అయితే గత కొంతకాలంగా భూమా అఖిలప్రియ మాత్రం వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి తన సోదరుడు భూమా జగద్విఖ్యాత రెడ్డిని పోటీ చేయించాలన్న నిర్ణయంతో ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆ దిశగా అఖిలప్రియ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భూమా బ్రహ్మానందరెడ్డిని వెనక్కు నెట్టారు.
వచ్చే ఎన్నికల నాటికి...
నంద్యాల నియోజకవర్గంలో భూమా సన్నిహితులతో ప్రత్యేకంగా సమావేశాలను పెడుతున్నారు. దీంతో పాటు విజయ డెయిరీ ఛైర్మన్ పదవిని తన సోదరుడు జగద్విఖ్యాత రెడ్డికి కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం కూడా అందులో భాగమేనంటున్నారు. ఎందుకంటే జగద్విఖ్యాత రెడ్డిని తొలుత డెయిరీ ఛైర్మన్ గా చేసి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని, తాను తిరిగి ఆళ్లగడ్డ నుంచి నిలిచి గెలవాలన్నది అఖిలప్రియ ఆలోచనగా ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇస్తారన్న నమ్మకంతోనే అఖిలప్రియ ఉన్నట్లు కనపడుతుంది. ఎన్.ఎం.డి. ఫరూక్ కు వయసు మీరడంతో ఈసారి తమ కుటుంబానికే టిక్కెట్ లభిస్తుందని అఖిలప్రియ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. అందుకు తన కుటుంబంలోని జగద్విఖ్యాత రెడ్డిని నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని రూట్ మ్యాప్ ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారట. మరి టీడీపీ ఒక కుటుంబానికి రెండు టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో ఇస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.