ఎనిమిది మంది ప్రాణాలు ఇంకా టన్నెల్ లోనే.. బయటపడేదెప్పుడంటే?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో నిన్న ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేర పై కప్పు కూలింది.
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో నిన్న ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేర పై కప్పు కూలింది. ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. దాదాపు ఇరవై గంటలుగా కార్మికులు టన్నెల్ లోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీసే ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. టన్నెల్ లో మూడడగుల మేర నీరు నిలిచి ఉండటంతో పన్నెండు కిలోమీటర్ల మేరకు బురద పేరుకు పోయింది. ఎన్.డి.ఆర్.ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొంటుంది. అయినా లోపల కి వెళ్లేందుకు నీరు అడ్డంకిగా మారుతుంది.
నీటిని తొలగించేందుకు...
నీటిని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బురద నీటిని తొలగించేంత వరకూ చిక్కుకుపోయిన వారిని రక్షించే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. పథ్నాలుగు కిలోమీటర్లు లోపలకి వెళ్లినా కార్మికుల జాడ కనిపించలేదు. లోపలకు వెళితే నెట్ వర్క్ పనిచేయడం లేదు. అయితే ఆ ప్రాంతానికి ఆక్సిజన్ అందుతుందా? లేదా? అన్నది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆక్సిజన్ ను టన్నెల్ లోపలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.అడ్డంకులు అధిగమించి చిక్కుకుపోయిన కార్మికుల వద్దకు చేరుకోవాలంటే మరో నాలుగు గంటల సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిచెబుతున్నారు.
నీరు ఆహారం లేకుండా...
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని ఎఫెర్ట్స్ పెట్టాలని అధికారులను, మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపు ఇరవై గంటల నుంచి టన్నెల్ లో ఉండటంతో వారికి నీరు ఆహారం లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కాకుండా ఉందని తెలిపారు. వారు బయటకు వచ్చిన క్షణమే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. మరికొద్ది గంటల్లోనే కార్మికులు బయట పడే అవకాశముంది. అయితే కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్త మవుతుంది. ఎనిమిది మంది ప్రాణలు టన్నెల్ లో చిక్కుకుపోవడంతో శక్తి వంచన లేకుండా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.