Andhra Pradesh : ఏబీవీ...ఎదురొస్తున్నారటగా.. అదే జరిగితే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏబీ వెంకటేశ్వరరావు తలనొప్పిగా మారారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏబీ వెంకటేశ్వరరావు తలనొప్పిగా మారారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు. ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రావాల్సిన ప్రయోజనాలు రాకుండా పోయాయి. అయితే 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత తనకు లభిస్తుందని ఆశించారు. భావించారు కూడా. కానీ దానికి విరుద్ధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో ఏబీ వెంకటేశ్వరరావు మనస్థాపానికి గురయ్యారు. ఆ పదవిని తాను తీసుకోవడం లేదని ఆయన ప్రకటించారు.
కూటమి ప్రభుత్వ నిర్ణయాలను...
అయితే గత కొన్ని రోజులుగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణపై కూడా ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా తప్పుపట్టారు. కందుకూరులో జరిగిన దారుణహత్యలో ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించడంపై కూడా ఏబీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును ఇలా ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇలా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండటంతో ఆయనను చంద్రబాబు చూసీ చూడనట్లు వదిలేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.
కొత్త ఏడాది ప్రకటన...
ఏబీ వెంకటేశ్వరరావు ఏపీలో కొత్త రాజకీయ పార్టీని పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడానికి ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇందుకోసం తనకు అనుకూలురైన కొందరు మద్దతు దారుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారని తెలిసింది. త్వరలోనే ఆయన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. అయితే విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గతంలో పార్టీలు పెట్టినా ఎవరూ పెద్దగా రాణించలేదు. మరి ఏబీ వెంకటేశ్వరరావు ఏ మేరకు రాణిస్తారన్నది అనుమానమే అయినప్పటికీ.. ముఖ్యంగా ఏబీవీ మాత్రం చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగానే పార్టీని ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది ప్రకటన చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని సమాచారం.