పల్నాడు జిల్లాలో పెద్దపులి మరణించింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్దపులి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం నాలుగు పెద్దపులులు ఉన్నాయని, వాటిలో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని తెలిపారు.
అటవీ శాఖ అధికారులు...
పెద్దపులి మృతితో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, వైల్డ్‌లైఫ్ క్రాసింగ్ సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పులులు అడవులు వదిలి బయటకు వస్తుండటంతో ప్రమాదాలకు గురయి మరణించడం ఆందోళనకు గురి చేస్తుంది.