అమరావతిలో రతన్ టాటా హబ్ ప్రారంభం
అమరావతిలో రతన్ టాటా హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
అమరావతిలో రతన్ టాటా హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరిటెక్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజల అవసరాలను తీర్చే స్టార్టప్ కేంద్రంగా ఈ ఇన్నోవేషన్ హబ్ ను తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు కోరారు.
హైటెక్ సిటీ తరహాలోనే...
హైదరాబాద్ లో హైటెక్ సిటీని తానే నిర్మించానని, నాడు నవ్విన వారే నేడు అదే తెలంగాణకు సంపాదన తెచ్చిపెట్టే కేంద్రంగా మారిందని చంద్రబాబు అన్నారు. తనకు భగవంతుడో మరో అవకాశాన్నిఇచ్చారని, తాను ఇంకో నగరం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నానని, అమరావతిని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నానని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలన్నదే తమ ప్రభుత్వం ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని ఎలా ప్రయత్నించి సక్సెస్ అయ్యానో.. ఇప్పుడు కూడా పారిశ్రామికవేత్త కూడా ప్రతి ఇంటి నుంచి వస్తారని చంద్రబాబు అన్నారు.