మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ రాణించేనా..!

ఇప్పటి దాకా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 12 పతకాలు సాధించింది

Update: 2022-08-19 06:54 GMT

టోక్యోలో 22 ఆగస్టు 2022 నుండి BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మొదలుకాబోతోంది. భారత షట్లర్లు ఈ టోర్నమెంట్ లో పతకాలను సాధించాలనే లక్ష్యంతో అడుగుపెట్టనున్నారు. ఇక్కడ కూడా స్వర్ణ పతకాలను సాధించాలని భావిస్తూ ఉన్నారు. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో షట్లర్లు అద్భుతంగా రాణించి ఆరు పతకాలను కైవసం చేసుకున్నారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్యాలు, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. పివి సింధు, లక్ష్య సేన్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట వారి వారి ఈవెంట్‌లలో స్వర్ణ పతకాలు సాధించగా.. కిడాంబి శ్రీకాంత్, ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ జంట కాంస్యం సాధించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు రజత పతకం సాధించింది.

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున 26 మంది బృందం పాల్గొనబోతోంది. ఇప్పటి దాకా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 12 పతకాలు సాధించింది, అయితే 2019లో పివి సింధు ద్వారా మాత్రమే స్వర్ణం వచ్చింది. PV సింధు మినహా కామన్వెల్త్ గేమ్స్ 2022 లో పతక విజేతలందరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంటారు. సింధు ఎడమ పాదానికి గాయం కావడంతో వైదొలగాల్సి వచ్చింది.
సైనా.. సాధించేనా:
కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి తప్పుకున్న తర్వాత సైనా తిరిగి పునరాగమనం చేయనుంది. యువ షట్లర్ మాళవికా బన్సోడ్‌తో కలిసి మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ కూడా పోటీ పడనుంది. సైనా నెహ్వాల్ హాంకాంగ్‌కు చెందిన చియుంగ్ న్గాన్ యితో తలపడుతుంది. ఆమె టోర్నమెంట్ ప్రారంభంలో జపాన్‌కు చెందిన ప్రపంచ నం. 6 నోజోమి ఒకుఖారాతో తలపడవచ్చు. మాళవిక డెన్మార్క్ వరల్డ్ నం. 21 లైన్ క్రిస్టోఫర్సన్‌తో తలపడనుంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే పురుషుల సింగిల్స్‌లో పాల్గొనేవారిలో ముగ్గురు ఏస్ షట్లర్‌లను ఒకే గ్రూపులో ఉంచారు. దీని ఫలితంగా వారిలో ఒకరు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటారు. ముగ్గురు షట్లర్లు – కిదాంబి శ్రీకాంత్ (13), లక్ష్య సేన్ (10), హెచ్ఎస్ ప్రణయ్ (18) ఒకే గ్రూపులో ఉన్నారు. ఈ ముగ్గురు షట్లర్లు కాకుండా, బి. సాయి ప్రణీత్ చైనీస్ తైపీకి చెందిన ప్రస్తుత ప్రపంచ నం. 4 చౌ టియెన్ చెన్‌తో కలిసి ఇతర గ్రూప్‌లో ఉన్నాడు. ఇద్దరూ తమ తొలి రౌండ్‌ను క్లియర్ చేస్తే H.S ప్రణయ్ లక్ష్య సేన్‌తో తలపడే అవకాశం కూడా ఉంది.


Tags:    

Similar News