‘హ్మాపీ బర్త్ డే’ జగన్ అంటూ....!

Update: 2017-12-21 06:30 GMT

వైసీపీ అధినేత జగన్ తన పుట్టినరోజువేడుకలను జనం మధ్యలోనే చేసుకున్నారు. ప్రస్తుతం జగన్ 46వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. జగన్ 41వ రోజు పాదయాత్రలో 46వ పుట్టిన రోజు వేడుకను జగన్ జరుపుకున్నారు. జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు. వైఎస్ జగన్ పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమడ వద్ద బస చేశారు. జగన్ ఉదయం నిద్ర లేచిన వెంటనే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. రాష్ట్రంలోని అనేక మంది నేతలు జగన్ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు.

శిబిరం వద్దే వేడుకలు....

జగన్ 1972 డిసెంబరు 21వ తేదీన జన్మించారు. అయితే ప్రతిసారీ కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకునే జగన్ ఈ సారి పాదయాత్రలో ఉండటంతో జనం మధ్యనే ఆయన బర్త్ డే కేక్ కట్ చేశారు. జగన్ బస చేసిన చోటుకు వేలాది మంది కార్యకర్తలు చేరుకోవడంతో కొంత తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను అదుపు చేయాల్సి వచ్చింది. జగన్ కోసం ప్రత్యేకంగా పెద్ద కేక్ ను తెప్పించారు. వైసీపీ నేతలు తరలి వచ్చి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా ప్రజల మధ్యనే చేసుకోవాలని తాను భావించినట్లు జగన్ తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైసీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. వెంటనే జగన్ పాదయాత్రను ప్రారంభించారు.

Similar News