Chandrababu : చంద్రబాబు ఆశ ... ఎవరు వచ్చినా ఇంతే కదయా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి ఎన్నికలు ఎప్పుడు జరిగినా గట్టెక్కిస్తాయని భావిస్తున్నట్లుంది.

Update: 2025-10-06 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి ఎన్నికలు ఎప్పుడు జరిగినా గట్టెక్కిస్తాయని భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన పదే పదే సంక్షేమం పదాన్ని వల్లె వేస్తున్నారు. అభివృద్ధి అన్న మాట కంటే ఎక్కువగా సంక్షేమం అనే పదమే ఎక్కువ సార్లు ఆయన నోట వినిపిస్తుంది. గత పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు, ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు వంటి పథకాలను అమలు చేశారు. వీటితో పాటు తల్లికి వందనంతో పాటు అన్నదాతకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేశారు. సంక్షేమం విషయంలో చంద్రబాబు ను ఎవరూ తప్పుపట్టలేరు.

గత మూడు దఫాలుగా...
నిజానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గత మూడు దఫాలు సంక్షేమం అమలు చేసిన దానికంటే ఎక్కువగా ఈ టర్మ్ లో అమలు చేసి చూపుతున్నారు. గతంలో మూడు దఫాలు ఆయన విజన్ తో పనిచేసేవారు. సంక్షేమం అనేది ఆయనకు లీస్ట్ ప్రయారిటీగా ఉండేది. రాష్ట్ర భవిష్యత్ అంటూ సుదూర దృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడంతా సంక్షేమ మంత్రమే ఆయన నోటి నుంచి వినిపిస్తుండటం ఒకింత పార్టీ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తన పై ఉన్న అపవాదును చెరిపేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయరు అన్న వారి నోళ్లను మూయించడానికే సంక్షేమాన్ని భారమైనా భుజానకెత్తుకున్నారంటున్నారు.
సంక్షేమాన్ని అమలు చేసినంత మాత్రాన...
అయితే సంక్షేమాన్ని అమలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే రెండోసారి విజయం సాధించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ అనేక సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేసిన కేసీఆర్ ను కూడా ప్రజలు ఓడించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశానని జబ్బలు చరుచుకున్న జగన్ ను కూడా పక్కన పెట్టేశారు. అంటే సంక్షేమం ఎప్పటికప్పుడు టర్న్ అవుతుందా? అన్నది మాత్రం ఇక్కడ అర్థం కావడం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే ఒకింత ఎక్కువే ఇవ్వాల్సి ఉంటుంది. కోతలు పెట్టడానికి వీలుండదని భావించి ప్రజలు మార్పును కోరుకుంటే సంక్షేమ మంత్ర పనిచేయదని చెప్పాలి. అందుకే చంద్రబాబు పదే పదే సంక్షేమం నినాదాన్ని అందుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం చివర వరకూ చెప్పలేమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రానురాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడమే తప్పించి పెరగడం జరగదని తెలిసినా పాలకులు మాత్రం సంక్షేమం వైపునకు పరుగులు తీయడం కొన్నివర్గాల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News