Andhra Pradesh Politics : మూడు పార్టీలనూ "లోకల్" ముంచేస్తుందా? ఏంది?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Update: 2025-10-06 08:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విడతల వారీగా ఎన్నికలు జరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. 2026 జనవరి లేదా మార్చి నెలల్లోనే ఈ ఎన్నికలు ఉండే అవకాశముంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజీ ఉంటుంది. అంగబలం, అర్థబలం సమృద్ధిగా ఉండటంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రాంతంలో కూడా గెలిస్తే మేలు జరుగుతుందని ప్రజలు సహజంగా భావిస్తారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉంటాయి.

నేతల మధ్య విభేదాలను...
అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతల మధ్య విభేదాలు ఎన్నికల ఫలితాలను ఏ రకమైన ప్రభావానికి గురి చేస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు మాత్రం కలసికట్టుగానే ఉన్నారు. కానీ నేతల మధ్యనే సఖ్యత లేదు. అది వాస్తవం. ఏ పార్టీ నియోజకవర్గంలో అధికారంలో ఉంటే మిగిలిన కూటమి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలు వ్యతిరేకిస్తున్నారు. నామినేటెడ్ పదవులు తమకు దక్కకపోవడంతో పాటు పనుల కేటాయింపులో కూడా తమకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసహనం, అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. మద్యం షాపులు, ఇసుక, కాంట్రాక్టు పనులు వంటి విషయాల్లో తమకు అన్యాయం జరుగుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు.
అసంతృప్తి.. అసహనం...
కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరొకవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. కానీ నేతల మధ్య సమన్వయం లేమి కూటమి కొంపముంచుతుందేమోనన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గమే తీసుకుంటే అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ జనసేనలోనే రెండు నుంచి మూడు గ్రూపులున్నాయి. ఇక టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య పొసగడం లేదు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. లోకల్ ఎన్నికల్లో దెబ్బతీసి ఎమ్మెల్యేను అధినాయకత్వం ముందు దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తుందంటున్నారు. అదే జరిగితే కూటమిలోని మూడు పార్టీలకూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోట్లు తప్పవని కూటమి పార్టీ నేతలే అంటుండటం విశేషం. అయితే మరో మూడు నాలుగు నెలల సమయం ఉండటంతో అప్పటికి పరిస్థితి చక్కబడే అవకాశాలున్నాయన్న ఆశలు మాత్రం నేతల్లో కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News