Pawan Kalyan : పవన్ మూగనోము అందుకేనా? ఇచ్చి పడేయటానికి టైం కోసం ఎదురు చూస్తున్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇకపై కొంత అంటీముట్టనట్లుగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇకపై కొంత అంటీముట్టనట్లుగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పదవులు విషయంలోనూ, మరో విషయంలోనూ గట్టిగా పట్టు పట్టకుండా పట్టువిడుపులకు పోతే తన చేతకాని తనంగా కూటమిలోని ఇతర పార్టీ నేతలే భావిస్తున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. తన మంచితనమే తనకు శాపంగా మారిందని ఆయన సన్నిహితుల వద్ద ఒకింత ఆందోళన.. అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి కాకూడదన్న ఏకైక లక్ష్యంతో అన్ని విషయాల్లో సర్దుకుంటూ వెళుతుంటే అది తన విషయంలో తప్పుగా టీడీపీ నేతలు అర్థం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది.
విజయవాడ కార్యక్రమంలోనూ...
రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముభావంగానే కనిపించారు. సహజంగా ఆయన సభల్లో నవ్వుతూ తుళ్లుతూ కనిపించేవారు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. తనపై టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేశ్, బొండా ఉమామహేశ్వరరావు లు ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ ఆయన తల కిందకు దించుకుని నేల చూపులు చూస్తున్నట్లు అనిపించింది. అయిష్టంగానే ఆయన ఈ సమావేశానికి హాజరయినట్లుందని జనసైనికులే బహిరంగంగా చెబుతున్నారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ అలా ఉన్నారా? లేక ఇటీవల జరిగిన పరిణామాల కారణంటా అలా ఉన్నారా? అన్న చర్చ జనసేన పార్టీలో జరుగుతుంది.
మౌనంగా ఉంటున్నది...
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకపోయినా, తన సోదరుడు చిరంజీవిపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకింత మనస్థాపానికి గురి చేశాయంటున్నారు. అయితే తన నిర్ణయం కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందని భావించి మౌనంగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లడం ఓకే గాని, కనీసం సభలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ చేత వెనక్కు తీసుకునేలా చేయలేకపోయారన్న అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బయటపడటం భావ్యం కాదని, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో ఆయన మౌనంగా ఉన్నారంటున్నారు జనసేన నేతలు.
పిఠాపురం నియోజకవర్గంలోనూ...
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మకు గన్ మెన్ లు కేటాయించడంతో పాటు తన నియోజకవర్గంలోనే తనకు ఇబ్బందులు టీడీపీ వల్లనే కలుగుతున్నాయని ఆయన గట్టిగా భావిస్తున్నారు. పిఠాపురంలో తనకు వైసీపీ శత్రువు కాదని, ఇప్పుడు టీడీపీ నేతలే శత్రువులగా తయారయ్యారన్న భావనలో పవన్ ఉన్నట్లు కనపడుతుందని చెబుతున్నారు. అయితే ఎవరి పార్టీ నిర్ణయం వాళ్లది. అందుకే ఒకరి పార్టీ విషయంలో మరొకరు వేలు పెట్టడం సరికాదన్న అభిప్రాయంలో పవన్ కల్యాణ్ మాట్లాడటం లేదని జనసేనకు చెందిన కీలక నేత ఒకరు అన్నారు. భవిష్యత్ లో మరింతగా ముదిరితే అప్పుడు నేరుగా చంద్రబాబు వద్దనే పంచాయతీని పెట్టి తేల్చుకోవాలన్న అభిప్రాయంతో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలిసింది.