కర్ణాటకలో రాబోయే ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఇప్పటినుంచి హోమ్ వర్క్ గట్టిగా మొదలు పెట్టేశారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలనుంచి పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ రధసారధి అధికారంలో వున్న కర్ణాటకలో తిరిగి హస్తగతం చేసుకునే వ్యూహాల్లో తలమునకలయ్యారు. మోడీ ఎన్నికల మేనేజ్ మెంట్ ను తట్టుకుని విజయం సాధించడం నేటి పరిస్థితుల్లో కష్టమైన నేపథ్యంలో క్యాడర్ ను కార్యోన్ముఖులను చేస్తున్నారు రాహుల్. అందుకోసం ఢిల్లీ లో కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు ఆయన. కర్ణాటకకు ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకుండా ఉండేందుకు బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు యువనేత.
బెంగుళూర్ వదిలిపెట్టండి ...
తక్షణం కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బెంగుళూరు వదిలిపెట్టి తమ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారితోనే వుండాలని పిలుపునిచ్చారు ఆయన. వచ్చే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని హెచ్చరించారు రాహుల్.
బిజెపి మాయలో పడొద్దని సూచన...
వివాదాలకు దూరంగా వుండాలని, మాట్లాడే టప్పుడు ఆచితూచి స్పందించాలన్నారు రాహుల్. ఏ చిన్న వివాదాస్పద అంశం దొర్లినా దాన్ని తమకు అనుకూలంగా మల్చుకుని ఎన్నికలను బిజెపి ప్రభావితం చేయగలదని తప్పులు చేయవద్దని కోరారు. రాహుల్ తో భేటీ అనంతరం కర్ణాటక కాంగ్రెస్ నేతలు జోష్ మీద కనిపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి విజయం సాధిస్తుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 10 వతేది నుంచి కర్ణాటకలో రాహుల్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి ? సిద్ధరామయ్య ప్రభుత్వం తిరిగి అధికారం దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.