హోదా పోరాటం....ఎటువైపు?

Update: 2018-03-01 20:30 GMT

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకుంటే ఈనెల 15 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. గుంటూరులో జరిగిన సదస్సుకు వైసీపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలూ హాజరయ్యాయి. అయితే సదస్సులో ఐక్యంగా పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధించగలుగుతామని చెప్పారు. ఢిల్లీకి తెలుగువారి సత్తా తెలియజేయాలని పేర్కొన్నారు.దీంతో పాటు బీజేపీ నుంచి టీడీపీ విడిపోతే గాని ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

టీడీపీ బయటకు రావాలి....

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకూ ఏపీకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. కేంద్రం నిధులివ్వకుంటే ఏపీ అభివృద్ధి ఎలా జరుగుతుందన్నారు. బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి టీడీపీ బయటపడాలని ఆయన కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బీజేపీ, టీడీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ పోరాడుతున్నాయన్నారు. ప్రజలను రెండు పార్టీలూ మోసం చేశాయన్నారు.

వివిధ పంథాల్లో పోరాటం....

పదహారు రాజకీయ పార్టీలు, 45ప్రజాసంఘాలు ప్రత్యేక హోదా కోరుతున్నాని, మార్చి 5 నుంచి 7వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఢిల్లీలో పెద్దయెత్తున నిరసనలు తెలపాలని నిర్ణయించారు. బీజేపీ మీదే కాకుండా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న టీడీపీపై కూడా తమ పోరాటం ఉంటుందని మధు హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ 184 నిబంధన కింద కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చ హోదాపై చర్చకు పట్టుపడుతుందని చెప్పారు. దానిపై ఓటింగ్ కు కూడా పట్టుబడతామన్నారు. ఈ నెల8వ తేదీన పార్లమెంటు ముట్టడి చేస్తామని చెప్పారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి తమ చిత్తశుద్ధిని చాటు కోవాలన్నారు. అన్నీ జెండాలు పక్కనపెట్టి ఒకే అజెండాతో ముందుకు సాగాలని కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ప్రత్యేక హోదాపై అందరూ ఐక్యపోరాటం చేయాల్సిందేనని ఈ సదస్సులో తీర్మానించారు.

Similar News