హైదరాబాద్ సేఫ్ సిటీ కాదా...?

Update: 2018-01-31 02:30 GMT

సమగ్ర నేరస్తుల సర్వేతో నేరస్తుల ఏరివేత.. భరోసా సెంటర్లు.. షీటీమ్స్..కరుడు గట్టిన నేరగాళ్లపై పిడి యాక్ట్.. ఇలా నేర రహిత రాష్ట్రంగా సిటీని తీర్చిదిద్దాలని పోలీసు యంత్రాంగం నిరంతరం కష్టపడుతున్నా..జరిగే అనర్థాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అరగంటకో హత్య. నిమిషానికో మానభంగం మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా.. పట్టపగలు బయటకి వెళ్లాలన్నా భయంతో వణికిపోయే పరిస్థితులు దాపురించాయి. 24గంటల వ్యవధిలో ఆరు హత్యలు చోటు చేసుకున్న క్రైం సిటీపై ఓ రిపోర్ట్

24 గంటల్లో ఆరు హత్యలు...

సిటీలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు తమంతట తామే వస్తాయి. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ అనే నినాదంతో ముందుకు పోవాలంటూ పిలుపునిచ్చారు. దీన్ని ఫాలో అయ్యేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయినా నిత్యం వెలుగు చూస్తున్న ఘటనలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి రోజుకో కార్యక్రమంలతో ముందడుగు వేసినా పెరిగిన నేరాలు వాటినే వెక్కిరించేలా తయారయ్యాయి. గడచిన వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ మూడు కమీషనరేట్ల పరుధుల్లో క్రైం రేట్ విపరీతంగా పెరిగింది.

సర్వే చేసినా....

సమగ్ర నేరస్తుల సర్వే పేరుతో రాష్ట్ర మంతటా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు వారికి జియో ట్యాగింగ్ విధానాన్ని కూడా రూపొందించారు. కేడీలపై కన్నేసినా, కుటుంబ కలహాల నేపధ్యం.. ఇతర వ్యవహారాలతో జరిగే అనర్థాలు పోలీసుల విధులకే సవాల్ విసురుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ సిటీలో ఆరు హత్యలు చోటు చేసుకున్నాయి. మహిళ కోసం భరోసా సెంటర్లు.. షీటీమ్స్ ఏర్పాటు చేసినా అవి పేరుకే పరిమితం అయ్యేలా పరిస్థితులు మారాయి.

ముక్కలుగా నరికి....

చందానగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. తన కాపురంలో కలతలు రేగడానికి అక్రమ సంబంధం.. మరో వివాహమే కారణమని భావించిన నిందితుడు మధు తన అత్త విజయమ్మ, కూతురు కార్తిని గొంతునులిమి చంపి.. చివరకు అపర్ణను రోకలిబండతో మోది హత్య చేశాడు. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు మధు కోసం గాలిస్తున్న సమయంలోనే మరో పిడుగులాంటి వార్త వచ్చింది. కొండాపూర్ లో ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు మృతదేహాన్ని గోనెసంచిలో కుట్టి రోడ్డుపై పడవేశారు. దీనిపై నానా తంటాలు పడుతూ ఉంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే హయత్ నగర్ లో అనూష అనే యువతి దారుణ హత్యకు గురైంది. బీటెక్ పూర్తి చేసిన అనూష దేవరకొండ ప్రాంతం నుండి పోలీస్ కోచింగ్ కోసం వచ్చి హత్యకు గురైంది. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉన్న అనూషను గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వివాహేతర సంబంధాలే....

ఇక నెక్ నూర్ ప్రాంతంలో కూడ మరో మహిళ హత్యకు గురైంది. వీటన్నింటి పరీశీలిస్తే.. వివాహేతర సంబంధాలు.. కుటుంబ తగాదాలు.. ప్రేమ వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. మహిళల కోసం షీ టీమ్స్.. భరోసా సెంటర్లు ఏర్పాటు చేసిన వారిపై నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉండటమే కాదు.. బయటకు వెళ్లాలన్నా పట్టపగలు కూడ భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వరుస హత్యలు... చెలరేగి పోతున్న దుండగుల వల్ల హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమౌతోంది. చైన్ స్నాచింగ్ లు.. ప్రేమోన్మాదుల ఘాతుకాలు.. రేపిస్టులు... ఇప్పుడు హంతకులతో నిత్యం మహిళలు.. యువతులు భయంతో వణికిపోయే పరిస్థితులు దాపురించాయి. పాత నేరస్తుల కదలికలపై కన్నేసి వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు సమగ్ర నేరస్తుల సర్వే నిర్వహించిన మన పోలీసులు, కుటుంబ, ఇతర సంబంధాల నేపధ్యంలో జరుగుతున్న హత్యలపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే

Similar News