డిసెంబర్ 6వ తేదీ కావడంతో హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 గంటల పాటు నగరంలో 144వ సెక్షన్ విధించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పాతబస్తీలో 3500 మంది పోలీసులతో ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ లో 60 సమస్యాత్మక ప్రాంతాలను, 10 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు వర్గాలకు చెందిన 60 మంది అననుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు రోజులు సభలు, సమావేశాలు, నిరసనలు, ర్యాలీలు నిషిధ్దమని పోలీసులు ప్రకటించారు. ప్రార్థనామందిరాల వద్ద కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా రెచ్చగొట్టే చర్యలకు దిగితే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.