హైదరాబాద్ లో ఇంత దారుణం జరిగినా పట్టించుకోరా?

Update: 2017-10-06 01:30 GMT

లక్షల రూపాయలు వసూలు చేసే కన్వెన్షన్‌ సెంటర్లు , ఫంక్షన్‌హాళ్లు...భధ్రతను మాత్రం గాలికి వదిలేసాయి . శుభకార్యానికి వచ్చిన కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నా...కన్వెన్షన్‌ సెంటర్ల పై చర్యలు మాత్రం శూన్యం . హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో...అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోయినా...యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరించింది.

డబ్బులు మాత్రం లక్షల్లోనే.....

నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌...ఇందులో ఫంక్షన్‌ చేయాలంటే..మినిమమ్‌ 50 లక్షలు దాటాల్సిందే . సంపన్న కుటుంబాలన్నీ తమ స్టేటస్‌ను చూపించుకునేందుకు సైతం ఇలాంటి కన్వెన్షన్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు . ప్రాణాలకు భద్రత లేని చోట...ఎంత డబ్బు పెడితే ఏం లాభం..శుభకార్యం జరగాల్సిన చోట అశుభకార్యాలు చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి . బుదవారం రాత్రి...విజయవాడ సమీపంలోని నందిగామకు చెందిన ఓ కుటుంబం వివాహ వేడుక..శుభం కన్వెన్షన్‌లో జరుగుతోంది . ఓ రాజకీయ పార్టీకి చెందిన కుటుంబ వేడుక కావడంతో...ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

స్విమ్మింగ్ పూల్ మింగేసింది.....

రాత్రి 9 గంటల టైమ్‌లో ...హాల్లో పెళ్లి వేడుక జరుగుతోంది...బందువులంతా సంతోషంలో మునిగిపోయారు . పెళ్లి కూతురుకు దగ్గరి బందువులైన ఇద్దరు ఐదేళ్ల వయసు చిన్నారులు జితేందర్ , మనశ్రీ అల్లరి చేస్తుండటంతో...వారి తాతయ్య ఇద్దరినీ ఆడించేందుకు హాల్‌ బైటకు తీసుకవచ్చాడు . రంగు రంగుల వాటర్‌ ఫౌంటెయిన్‌ కనిపించడంతో పిల్లలు ఎగిరి గంతేసారు . అల్లరి చేయడం మాని ఇద్దరూ ఫౌంటెయిన్‌ వద్ద ఆడుకోవడం స్టార్ట్‌ చేసారు...కానీ..ఆ తాతయ్య... తన మనువడు, మనువరాలికి ఫౌంటెయిన్‌ రూపంలో మృత్యువు కాటేయబోతోందని ఊహించలేకపోయాడు . వాటర్‌ ఫౌంటెయిన్ వద్ద ఆడుకుంటున్న మనశ్రీ ...వాటర్‌లో చేయి పెట్టింది..అంతే క్షణాల్లో ఆ చిన్నారి ఎగిరి నీటి సంపులో పడిపోయింది..అక్కా ..అనుకుంటూ జితెందర్‌ కూడా వాటర్‌లో చేయిపెట్టేసాడు...అంతే...రెప్పపాటులో ఇద్దరినీ ఆ సంపు లాగేసుకుంది...ఫంక్షన్‌కు వచ్చిన వారంతా గగ్గోలు పెడుతూ కాపాడే ప్రయత్నం చేసినా...లాభం లేకపోయింది . నీటిలోని మోటార్‌ వైర్లు తెగి ఉండటంతో...విద్యుత్‌ షాక్‌ ఆ ఇద్దరు చిన్నారులను బలితీసుకుంది.

ఆధారాలు దొరకకుండా......

చిన్నపాటి ఘటన జరిగినా నానా హడావిడి చేసే అదికారులు కానీ...పోలీసులు కానీ ఈ ప్రమాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఇన్సిడెంట్‌ జరిగి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోయాయని తెలియగానే...కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాల్ని నందిగామకు తరలించాలని ప్రయత్నించారు . పోస్టుమార్టం లేకుండా డెడ్‌బాడీస్‌ను షిఫ్ట్‌ చేస్తే...ఆదారాలు ఉండవని భావించారు..కానీ..పోలీసు ఉన్నతాదికారుల జోక్యంతో ఎల్‌బీనగర్‌ పోలీసులు..చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు . విద్యుత్‌ ప్రమాదం జరిగిన ప్లేస్‌లో ఉన్న సీసీ కెమోరాలను వెంటనే తీసేసి...అందులోని ఫుటేజీ బైటకు రాకుండా జాగ్రత్త పడ్డారు . పోలీసులు సైతం...మమా అనేలా కేసు నమోదు చేశారే తప్ప..ఘటనకు బాధ్యులుగా ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారుల ప్రాణాలు పోయినా...కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వాహకులు మాత్రం...తమ ఫంక్షన్‌హాల్‌కు చెడ్డపేరు రాకుండా..విషయం బైటకు పొక్కకుండా ఉండాలని ట్రై చేసారే తప్ప...తమ భద్రతాలోపం వల్లే చిన్నారుల ప్రాణాలు పోయాయని మాత్రం అంగీకరించలేకపోయారు . శుభకార్యం కోసం అని వస్తే...ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోవటంతో...రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది . ఇకనైనా అదికారులు...ఇలాంటి ఫంక్షన్‌హాళ్లు , కన్వెన్షన్‌ సెంటర్లపై చర్యలు తీసుకుంటే...భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా నివారించవచ్చు.

Similar News