ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు చేసే కాల్స్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. మానసిక దౌర్బల్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఆ తరువాత ఖాకీలకు తేలిగ్గా దొరికిపోతుంటారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్ లు, బ్యాంక్ లు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు వీరి ప్రధాన టార్గెట్. కాకపోతే అప్పుడప్పుడు ప్రధాన ఈవెంట్స్ ను సైతం టార్గెట్ చేస్తూ అక్కడ బాంబు పెట్టాం , ఇక్కడ పెట్టాం అంటూ ఫోన్లు చేస్తూ వుంటారు. అవి రాంగ్ కాల్స్ అని తెలిసినా పోలీసులు సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతారు. గంటలకొద్ది అందరికి ఏర్పడే అసౌకర్యానికి సైకో మనస్తత్వం తో వుండే వారు ఎంతో ఆనంద పడి చేసిన వెధవపనికి ఆనందిస్తారు.
ఫలక్ నుమా లో బాంబ్ పెట్టానని ఫోన్ చేసిన పిచ్చోడి అరెస్ట్ ...
ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విందును ఫలక్ నుమా ప్యాలస్ లో ఇచ్చారు. ఈ విందుకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన అతిథులతో బాటు వున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిష్ఠతో కూడిన ఈ కార్యక్రమంలో విందు జరిగే ప్రాంతంలో బాంబు పెట్టనంటూ ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ భద్రతా సిబ్బందిని పోలీసులను పరుగులు పెట్టించింది. ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి ఆకతాయి గా కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పట్టేశారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి మానసిక రోగి అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతిధులు ఆతిధ్యం తీసుకుని వెళ్ళాక ఈ ఉదంతాన్ని పోలీసులు తాపీగా తాజాగా వెల్లడించారు.