హైదరాబాద్ ను గత కొన్ని రోజులుగా వర్షాలు వదలడం లేదు. రోడ్లన్నీ జలమయమే. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే. ఉదయం చలి... మధ్యాహ్నం... ఎండ... సాయంత్రం భారీ వర్షం. ఇదీ హైదరాబాద్ పరిస్థితి. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే ఈ భారీ వర్షాలని వాతావరణ శాఖ చెబుతోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీనీళ్లు కలిసి నగరమంతా దుర్గంధం వ్యాపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న అధికార పార్టీ హైదరాబాద్ అభివృద్ధిపై నజర్ పెట్టడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఎక్కడపట్టినా రోడ్లపై గుంతలే వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గంటల కొద్దీ ట్రాఫిక్ స్థంభించిపోతోంది.
కార్పొరేటర్లు ఎక్కడ?
మామూలు రోజుల్లో వార్డుల్లో హడావిడి చేసే కార్పొరేటర్లు భారీ వర్షాలకు బయటకు రావడం లేదు. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్లు తప్పించి కార్పొరేటర్లు పత్తా లేకుండా పోయారు. ఇళ్లలో నిలిచిన నీరు మోటార్లతో తోడించాలని ప్రజలు వేడుకుంటున్నా వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రతి రోజూ ఉదయమే వార్డులను సందర్శించే కార్పొరేటర్లు గత పది రోజులుగా మాత్రం రావడం లేదంటున్నారు ప్రజలు. ఈ సమయంలో వస్తే ప్రజలు సమస్యలతో నిలదీస్తారన్న భయంతోనే వారు బయటకు రావడం లేదు. ఓట్లు అడిగే సమయంలో వచ్చిన ప్రజాప్రతినిధులు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కన్పించడం లేదని వాపోతున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు అస్సలు కన్పించకుండా పోవడంపై మంత్రి కేటీఆర్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని జనజీవనం అతలాకుతలం అవుతోంది.