హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...!

Update: 2018-02-18 03:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక రెడీ అయిపోతోంది. ఇప్పటి వరకూ బస్సు యాత్రపై క్లారిటీ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బస్సు యాత్రను ప్రారంభించబోతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ తెలంగాణలో మొదటి విడత బస్సు యాత్రను స్టార్ట్ చేయనుంది. గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించాలని భావించింది. అయితే బస్సు యాత్రలో ఎవరెవరు పాల్గొనాలి? ఎంతమంది ఉండాలి? నేతల పేర్లతో సహా అధిష్టానానికి పంపింది. అయితే హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఇప్పటి వరకూ దానిని పక్కన పెట్టేసింది. కాని తాజాగా అధిష్టానం ఓకే చెప్పడంతో యాత్రను షురూ చేసింది.

సెంటిమెంట్ గా ఉన్న చేవెళ్ల నుంచే....

అయితే తాజాగా హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో బస్సు యాత్రను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటుంది. తనకు అచ్చొచ్చిన చేవెళ్ల నియోజకవర్గం నుంచే బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అనేక కార్యక్రమాలు చేవెళ్ల నుంచే ప్రారంభించారు. అది సెంటిమెంట్ గా భావించిన కాంగ్రెస్ బస్సు యాత్రను కూడా చేవెళ్ల నుంచే షురూ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

విడతల వారీగా బస్సు యాత్ర......

ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ బస్సు యాత్ర జరుగుతుంది. తర్వాత హోలీ పండగ ఉండటంతో మూడు రోజుల విరామం అనంతరం మార్చి 4వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే మార్చి 4 నుంచి 11వ తేదీ వరకూ జరిగే బస్సు యాత్ర తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి ప్రారంభం కానుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి మే 15వ తేదీ వరకూ బస్సు యాత్ర నిర్విరామంగా సాగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జూన్ 1వ తేదీన వరంగల్ లేదా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశముంది. మొత్తం మీద అధికార పార్టీ మీద మాటల దాడికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. బస్సు యాత్రలో ముఖ్యనేతలు మాత్రమే పాల్గొననున్నారు.

Similar News