హీరోయిన్ తమన్నాకు షాక్ ...!

Update: 2018-01-29 02:08 GMT

సెలబ్రిటీలపై ఏదోరకంగా దాడులు చేసి వార్తల్లో నిలవాలనే ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజాగా హైదరాబాద్ నారాయణ గూడ ప్రాంతంలో మలబార్ గోల్డ్ షాపు ప్రారంభోత్సవానికి హాజరైన హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో ఆమెపై ఒక ఆగంతకుడు చెప్పుతో దాడి చేశాడు. ఈ సంఘటనతో తమన్నా ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. వెంటనే తేరుకున్న అక్కడే వున్న భద్రతా సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమన్నాపై చెప్పు విసిరిన వ్యక్తి పేరు ముషీరాబాద్ కి చెందిన కరీముల్లా గా గుర్తించారు. ఎందుకు ఆమెపై ఈవిధంగా చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు తమదైన శైలిలో కరీముల్లా ను విచారిస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల పవన్ పై కూడా ...

ఇటీవల తెలంగాణ లో పర్యటిస్తున్న జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ పై కూడా ఇలాగే జరిగింది. కొత్త గూడెం రోడ్ షో లో ఒక ఆగంతకుడు పవన్ పై చెప్పు విసిరాడు. ఆ చెప్పు అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ పై పడకుండా ఆయన కారు పై పడింది. ఈ చెప్పు ఎవరు విసిరింది పోలీసులు గుర్తించలేక పోయారు. ఆ సంఘటన పికె ఫ్యాన్స్ ఆగ్రహానికి దారితీసింది. పవన్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల వరకు...

చెప్పులతో సెలబ్రెటీలపై దాడులకు పాల్పడటం ఒక మానసిక రుగ్మతగా వైద్యులు చెబుతూ వుంటారు. ఈ తరహా దాడులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. దేశాధ్యక్షుల నుంచి న్యాయమూర్తుల వరకు ఇలాంటి సంఘటనల్లో బాధితులే. సమాజంలో మానసిక సంఘర్షణ ల మధ్య వత్తిడితో జీవనం సాగించడం వల్లే కొందరు ఇలాంటి చర్యలకు దిగుతారని అందరికి తెలిసినా వీరి సంఖ్య నానాటికి పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం.

Similar News