హీరో కాదు...నిజజీవితంలో విలన్...!

Update: 2018-01-31 02:15 GMT

సినీ నటుడు విజయసాయి కధ సుఖాంతం కాకముందే మరో నటుడి కలహాల కాపురం పోలీస్ స్టేషన్ కి చేరింది. నటుడు సామ్రాట్ అతని భార్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో అదనపు కట్నం కేసు పెట్టిన హర్షిత ఈ సారి తన భర్త దొంగతనానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో నటుడు సామ్రాట్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. తన కూతురికి నరకం చూపిన సామ్రాట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు పోలీసులను కోరారు.

ఇంట్లో నగలు తీసుకెళ్లి....

సినిమా వాళ్ల జీవితాలు మూడు నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. నిన్న కమెడియన్ విజయ్ సాయి ఘటన మరచిపోకముందే మరో నటుడు కాపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నటుడు సామ్రాట్ దొంగతనం చేసాడంటూ అతని భార్య మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. మాదాపూర్ లో ఉన్న నెక్టార్ గార్డెన్ లోని తన ఇంట్లో సీసీ కెమెరాలు ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న నగలు తీసుకెళ్ళాడని ఫిర్యాదు చేసారు. గతంలో కూడా సామ్రాట్ పై వరకట్న వేధింపులు కేసు రాజేంద్రనగర్ పిఎస్ లో నమోదయ్యింది. అయితే మధ్యవర్తి ద్వారా కేసును ఉపసంహరించుకునేలా చేశాడు. వారం రోజులు బాగానే ఉన్నా మళ్లీ తనలోని రెండో కోణాన్ని భార్యకి చూపించాడు.

కోటి కట్నం ఇచ్చినా....

2015లో కోటి రూపాయలు కట్నం ఇచ్చి ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా వివాహం చేశామని.. పెళ్లైన మరునాడే కారు కావాలంటే 43 లక్షలు పెట్టి ఆడీ కారు కొనిచ్చామని సామ్రాట్ అత్తామామలు తెలిపారు. డబ్బు.. నగలు.. స్థలం.. ఖరీదైన వస్తువులు ఇచ్చినా.. ఇంకా కావాలంటూ తన కూతురిపై వత్తిడి చేసేవాడని తెలిపారు. పెళ్లి సంబంధం వచ్చిన కొత్తలో సామ్రాట్ సినిమాలు వదిలేసి వస్తా అంటేనే తమ పిల్లను ఇచ్చామని పెళ్ళయిన నాటి నుంచి అదనపు కట్నం కావాలంటు వేధిస్తున్నాడని అతని అత్తమామలు ఆరోపిస్తున్నారు.

అన్ని అలవాట్లూ ఉన్నాయి....

సామ్రాట్ కు అన్ని దురలవాట్లు ఉన్నాయని పబ్ ల చుట్టు తిరుగుతాడని, తనని కూడా పబ్ లకి రావాలని ఒత్తిడి చేస్తాడని సామ్రాట్ భార్య హర్షిత రెడ్డి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ తీసుకొని నిత్యం నరకం చూపించే వాడని.. మరో ఇద్దరు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకొని తనను అనుమానించే వాడని హర్షిత ఆరోపించింది. పెళ్లైన పదిరోజుల నుండే అదనపు కట్నం కోసం ఆయన పెట్టిన చిత్రహింసలు చెప్పుకొని ఆమె కుమిలిపోయింది. ఈ విషయం అతని తల్లిదండ్రులకు చెప్పినా అతనికే సపోర్ట్ చేసి తనను వేధించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంతో ఆటలాడుకున్న సామ్రాట్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చెయ్యాలని ఆమె కోరుతోంది.. హర్షిత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు సామ్రాట్ ను అరెస్ట్ చేసారు. సెక్షన్ 448, 427,380,454,201 ల కింద అతని పై కేసు నమోదు చేసారు. మొత్తానికి మరో నటుడి కలహాల కాపురం పోలీసు స్టేషన్ చేరింది. దొంగతనం. దాడి.. బెదిరింపులు. హత్యాప్రయత్నాలు.. అదనపు కట్నం కేసుల్లో పట్టుబడ్డ సామ్రాట్ ని మాదాపూర్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.

Similar News