హిమాలయాల బాట పట్టిన తలైవా

Update: 2018-03-11 10:30 GMT

నా దారి రహదారి ... ఆ దారిలో రావొద్దంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ కొట్టే డైలాగ్. ఇప్పుడు కూడా కీలకమైన తరుణంలో సాధారణంగా ఎవరు చేయని పనే మొదలు పెట్టారు తమిళ సూపర్ స్టార్. తన జీవితంలో కీలక ఘట్టాల్లో ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనేముందు హిమాలయాలకు వెళ్లిరావడం రజనికి అలవాటు. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేశారు. తనకు అత్యంత సన్నిహితులు కొందరితో హిమగిరులకు బయల్దేరారు ఆయన. హిమాలయాల్లోని పరమహంస యోగానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే రజని ఒక మందిరాన్ని నిర్మించారు. అక్కడే ఆయన ధ్యానముద్రలోకి వెళ్లనున్నారు. తమిళనాట రాబోయే ఎన్నికల్లో అత్యంత క్రీయ శీలకం కాబోతున్న రజనీకాంత్ భవిష్యత్తు వ్యూహాన్ని హిమాలయాల్లో ఖరారు చేసుకు రానున్నారు. ఎవరిపైనా విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం తమ పార్టీ సిద్ధాతం కాదని వాటివల్ల ప్రజలకు జరిగే మేలు ఏమి లేదని ఇప్పటికే తేల్చిన సూపర్ స్టార్ ఆధ్యాత్మిక రాజకీయ వేదికకు శంఖారావం పూరించనున్నారు.

సుడిగాలి పర్యటనలో కమల్ ...

మరో వైపు తన కొత్త పార్టీ మక్కల్ నీది మయ్యం పేరుతో తమిళనాడులో సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. తమ కొత్త పార్టీని ఆదరించాలని పార్టీ సిద్ధాంతాలను అధికారంలోకి వస్తే చేసే పనులు ప్రజలకు వివరిస్తున్నారు కమల్. ఆయన యాత్ర తమిళనాడు లోని ఈ రోడ్ కి చేరుకుంది. కమల్ పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలోనే హాజరౌతున్నారు. స్వచ్ఛమైన నిజాయితీ తో కూడిన రాజకీయాలను అందిస్తానని భరోసా ఇస్తున్నారు కమల్. తమిళుల ఆత్మగౌరవం చాటి చెబుతానని చెబుతున్నారు లోకనాయకుడు.

ఎన్డీయే లోకి అన్నాడీఎంకే ...

ఇదిలావుంటే అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే భాగస్వామిగా చేరుతుందని అంటున్నారు. కేంద్రంలో టిడిపి ఖాళీ చేసిన మంత్రి పదవులను మోడీ అన్నాడీఎంకే తో భర్తీ చేస్తారని అంటున్నారు. కేంద్రం ఏమి చెబితే అదే చేస్తున్న ఫళని స్వామి, పన్నీరు సెల్వం రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ క్యాడర్ జారిపోకుండా ఉండాలంటే మోడీ వంటి నేత అండ వుండాలని కోరుకుంటున్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. అదే జరిగితే తమిళనాట రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Similar News