ప్రత్యేకహోదా కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. హస్తిన సాక్షిగా నేడు ఆందోళనకు దిగబోతోంది వైసీపీ. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ గత నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ అనేకసార్లు యువభేరి పేరిట ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. ఆమరణ నిరాహారదీక్షకు కూడా దిగారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశారు జగన్. అయితే మళ్లీ ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకోవడంతో వైసీపీ ఢిల్లీ వేదికగా నేడు ఆందోళనను నిర్వహించనుంది.
నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా....
వైసీపీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న లక్ష్యంతో వైసీపీ హస్తిన ప్రయాణమయింది. రెండు రోజల క్రితమే హస్తిన పర్యటనకు జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలో జరిగే ధర్నాలో వైసీపీకి చెందిన అందరూ నేతలు పాల్గొనాలని జగన్ పిలుపునివ్వడంతో ఇప్పటికే అందరూ ఢిల్లీకి చేరుకున్నారు.
మలివిడత ఉద్యమంలో.....
ఇకవైసీపీతో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఆందోళనలను నిర్వహించనున్నాయి. మలి విడత ఉద్యమానికి అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. వైసీపీ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై అయిదు మంది నుంచి ముప్ఫయి ఐదు మంది వరకూ కార్యకర్తలు ఢిల్లీకి తరలి వెళ్లారు. వైసీపీ ఆందోళనకు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కూడా సంఘీభావం ప్రకటించింది. వామపక్షాలు కూడా ఈ ధర్నాలో పాల్గొననున్నాయి. మొత్తం మీద వైసీపీ ప్రత్యేక హోదాపై ఆందోళనలను షురూ చేసింది. మార్చి 21 వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం, ఏప్రిల్ ఆరోతేదీన వైసీపీ ఎంపీల రాజీనామాలు చేస్తారని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.