హవ్వ.... నారాయణా... ఇవేం విలువలు?

Update: 2017-10-28 16:30 GMT

స్కూల్ ఏదైనా కావొచ్చు. అక్కడి విద్యార్థులను ఎలాగైనా ఆ బడా సంస్థలకు తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఇక ఇంటర్ లో చేరే విద్యార్థుల కోసం వారి మార్కెటింగ్ నెట్ వర్క్ మరీ నీచంగా నడుస్తుంది. భావితరాలను తయారు చేసే అధ్యాపకులను రంగంలోకి దించి వారిని ఇల్లు ఇల్లు తిప్పి టార్గెట్ లు పెట్టి ప్రతి చిన్నారిని తమ సంస్థలో చేరే వరకు ఎస్ ఎం ఎస్ లు, ఫోన్ కాల్స్ , చివరిగా టీచర్ల బృందాలు ఇలా పలు రకాల దాడులు కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లితండ్రుల మీద చేస్తున్నాయి. వారు దారిలోకి వచ్చే దాకా కాల్చుకు తినేస్తాయి. చిన్నారులకు కౌన్సిలింగ్ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించేస్తాయి. ఇలా వలవేసి వేలకోట్ల విద్యా వ్యాపారానికి తెరతీసిన తెలుగు రాష్ట్రాల బడా విద్యా సంస్థలు అయిన నారాయణ , శ్రీచైతన్య ఇప్పుడు రోడ్డున పడి వీధిపోరాటాలకు తెరతీయడం చర్చనీయాంశం.

విద్యా మాఫియా వెనుక అధికారం, రాజకీయం...

విద్య ను మించిన వ్యాపారం లేదని చాలా కాలం క్రితమే తేలిపోయింది. ఆ వ్యాపారం కాస్తా మాఫియా గా మారింది అనడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దాష్టికాలు రోజుకొకటి ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉంటాయి. ఉత్తరాదిన కానీ, దక్షిణాదిన కానీ ఎక్కడా లేని విద్యా మాఫియా తెలుగు రాష్ట్రాల్లోనే కొలువు తీరింది. వీటి వెనుక అధికారం, రాజకీయం డబ్బు కొమ్ము కాస్తూ మాఫియా రక్షణకు నడుం కట్టాయి. తెలంగాణ, ఏపీ లో విద్యా రంగంలో ఏకఛత్రాధిపత్యానికి రెండు బడా విద్యా సంస్థలు నువ్వా నేనా అనే రీతిలో చాలా కాలం కుస్తీ పట్టాయి. ఇలా ఇద్దరు తన్నుకుంటే మూడో వాడు వచ్చేస్తారని భావించారో ఏమో ? చైతన్య , నారాయణ కలిసిపోయి చైనా గా అవతరించి తమ ముందు ఏ విద్యా సంస్థ లేకుండా చేయాలనే లక్ష్యంతో సాగిపోయాయి. ఎక్కడ చెడిందో కాని ఈ బడా విద్యా సంస్థల నడుమ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది.

తమ విద్యార్థులను కిడ్నాప్ చేశారని .....

తమ సంస్థ విద్యార్థులు చైతన్య విద్యా సంస్థల్లో చేరడాన్ని జీర్ణించుకోలేని నారాయణ విద్యా సంస్థలు తమ భాగస్వామిపైనే వేధింపులకు దిగేలా చర్యలు మొదలు పెట్టింది. తమ విద్యార్థులను చైతన్య వారు కిడ్నాప్ చేశారన్నది నారాయణ అభియోగం. దీనిపై ఇప్పుడు చైతన్య యాజమాన్యం లబోదిబో మంటుంది. విద్యా రంగంలో ఇలాంటి వారు వుంటారా అని నిలదీసింది. తల్లితండ్రులకు ఇష్టం లేకుండా తాము ఎలా నారాయణ విద్యార్థులను చేర్చుకుంటామని ప్రశ్నిస్తుంది. అధికారం రాజకీయ అండదండలతో వేధిస్తున్న నారాయణ తో ఇక తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నేరుగా మీడియా ముందే ఎటాక్ స్టార్ట్ చేశారు. చైతన్య నుంచి నారాయణలో ఎంతోమంది చేరినా తాము ప్రశ్నించలేదని వారి సంస్థల నుంచి ఎవరైనా బయటి విద్యా సంస్థలకు వెళితే ఇలాంటి వేధింపులకు సిగ్గులేకుండా దిగుతున్నారని ఆరోపించింది. నారాయణ బోడి గొప్ప ఏమి లేదని రత్నం, కేకేఆర్, విశ్వ భారతి వంటి విద్య సంస్థల నుంచి టాపర్స్ ను బలవంతంగా తెచ్చి వారు కొట్టే ర్యాంక్ లు మావే అంటూ డప్పు కొడుతుందని శ్రీ చైతన్య సంస్థ నారాయణ సీక్రెట్ చెప్పేసింది. అంతే కాకుండా ఐఐటీ, మెడికల్ లో ఇప్పటికి శ్రీచైతన్య కు తిరుగులేదని తమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను ఇక ఉపేక్షించమని తేల్చేసింది.

విడిపోతున్న శ్రీచైతన్య ...

ఇద్దరు రూల్స్ పాటిస్తేనే ఏదైనా చేయగలం, ఒకరు పాటించి మరొకరు పాటించకపోతే తాము భాగస్వామిగా ఎలా ఉంటామని శ్రీచైతన్య తెగేసి చెప్పేసింది. నారాయణ అరాచకాలను ఇక తట్టుకోలేము, వారి ఆగడాలకు చెక్ పెడతాం అని తేల్చేసింది. విద్యా సంస్థలు నడిపే వారికి విలువలు వుండాలని నారాయణ కు ఏమి లేవని కూడా ఆరోపించింది శ్రీచైతన్య .ఇబ్బంది పెట్టాలి , భయపెట్టాలి అనే ఐదేళ్లు కలిసి ప్రయాణించిన తమపై కిడ్నాప్ అభియోగాలతో పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. హై స్కూల్ స్థాయిలో చైనా బ్యాచ్ ఏమి లేదని ఇంటర్ లోనే టాపర్స్ తో ఇది నిర్వహిస్తామని పేర్కొంది .

వేలకోట్ల విద్యా వ్యాపారం ....

నారాయణ , శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలు సొసైటీల పేరుతో రిజిస్టర్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో అక్రమాలకు తెరతీస్తున్నాయని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయా సంస్థల వెనుక వున్న డబ్బు కి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పార్టీ ఫండ్ కోసం మోకరిల్లుతున్నాయనడానికి తాజా వార్ నిదర్శనమని అంతా విమర్శిస్తున్నారు. విద్యార్థులను తీవ్ర మానసిక కుంగుబాటుకు గురి చేసే విద్యా విధానం నడుస్తున్నా కళ్లుండి ప్రభుత్వాలు చూడలేకపోతున్నాయి. యాంత్రికమైన బట్టి విధానంలో రుబ్బురోలులో వేసి రుబ్బినట్లు సాగుతున్న నేటి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలిసి వుంది. ఒకపక్క వత్తిడికి గురై విద్యార్థులు గత పదేళ్లుగా వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు పైకి చెబుతున్న వాటికి ఆచరణలో చేస్తున్న దానికి పొంతన లేదు. ఈ బడా సంస్థలు ఏమి చేసినా చట్టాలు అతిక్రమించినా, నిబంధనలు ఉల్లంఘించినా ఎలాంటి చర్యలు వీటిపై ఉండటం లేదన్నది అందరికి తెలిసినదే. తాజాగా బడా విద్యా సంస్థల నడుమ మొదలైన ఈ కిడ్నాప్ వార్ ఏ మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Similar News