హమ్మ...శశికళా... ఇన్ని ఆస్తులా..?

Update: 2017-11-16 18:29 GMT

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహచరి శశికళ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 30 వేల కోట్ల రూపాయాలు. ఆమె కుటుంబానికి ఎన్నో వ్యాపారసంస్థలున్నాయి. సినిమా హాళ్లు, పత్రిక, టీవీ ఛానెళ్లతో పాటు ఎన్నో ఆస్తులను కూడబెట్టారు శశికళ. జయలలితతో నమ్మకంగా ఉంటూనే వెనక నుంచి ఆమె ఈ ఆస్తులను సంపాదించారు. ఈ ఆస్తులన్నింటినీ మన్నార్ గుడి మాఫియానే పర్యవేక్షిస్తుంది. ముప్ఫయి వేల కోట్ల రూపాయలు సంపాదించడ మంటే మాటలు కాదు. సామాన్య వీడియో గ్రాఫర్ గా మొదలైన శశికళ జీవితం జయలలిత సాన్నిహిత్యంతో పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చెన్నైలోనే కాదు బెంగళూరు, హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఆస్తుల చిట్టాను తీశారు ఐటీ అధికారులు.

శశికళను విచారించేందుకు సిద్ధం....

ఇటీవల వరుసగా ఆరు రోజుల పాటు జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో శశికళ బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల మేర శశికళ అండ్ కో పన్నులు ఎగ్గొట్టినట్లు ఐటీ శాఖ అధికారుల విచారణలో వెల్లడయింది. భారీగా సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ అక్రమార్జనను రెట్టింపు చేశారని తేలింది. దీంతో శశికళను విచారించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని జైల్లో ఉన్న శశికళను విచారించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. మొత్తం మీద శశికళ ఈ ఐటీ దాడులతో మరిన్ని చిక్కులు ఎదుర్కొననున్నారు.

Similar News