డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఆ కోట్లను ఎక్కడ దాచి పెట్టింది? డేరా బాబా ఆశ్రమంలోని నగదు మొత్తాన్ని హనీప్రీత్ ఎక్కడకు చేరవేసింది? ఇదే ప్రశ్న పోలీసులనూ వేధిస్తుంది. అత్యాచారం కేసులో డేరా బాబా, అల్లర్ల కేసులో హనీప్రీత్ ఇద్దరూ జైలు శిక్ష అనుభవిస్తున్నసంగతి తెలిసిందే. డేరాబాబాకు సంబంధించిన కోట్ల రూపాయలను హనీప్రీత్ ఎక్కడకో చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేరాబాబా ఆశ్రమంలో ఉన్నప్పుడు సంపాదన అంతా ఇంతా కాదు. హనీప్రీత్ అంతా దగ్గరుండి చూసుకునే వారు. విదేశీ విరాళాలను పెద్దయెత్తున హనీప్రీత్ పోగు చేసేవారు. నెలకు కోట్ల రూపాయలు వచ్చిపడేవి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరిట వీరు నిర్వహించే కార్యక్రమాల రేటు కూడా అదిరేట్లు ఉండేది. అయినా భక్తులు వెనకాడేవారు కారు. డేరాబాబా దర్శనం కోసం ఎంత మొత్తాన్నైనా వెచ్చించడానికి సిద్ధపడేవారు. దీంతో డేరా బాబా ఆశ్రమం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లేది. అయితే అత్యాచారం కేసులో అరెస్ట్ కాకముందు ఆశ్రమంలో పెద్దయెత్తున నగదు నిల్వలు ఉంచారన్నది పోలీసులు అనుమానం. దాదాపు 70 కోట్ల రూపాయల విలువైన నగదు ఆశ్రమంలోని డేరాబాబా కు చెందిన గదిలో ఉండేదని, దానికి రేయింబవళ్లూ కాపలా ఉండేదని డేరా బాబా అనుచరులే పోలీసులకు ఉప్పందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు దీనిపై విచారణ జరపాలని నిర్ణయించారు.
విచారణతో నగదు దొరుకుతుందా?
డేరాబాబా ఆశ్రమానికి 2010-2011లోనే 50 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే నెలకు కనీసం నాలుగు కోట్ల ఆదాయాన్ని డేరాబాబా రుచి చూసేవారన్న మాట. ఆశ్రమంతో పాటు షా సత్యం జీ రీసెర్చ్ ఫౌండేషన్, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, మ్యూజికల్ నైట్స్ ద్వారా కూడా డేరాబాబా విపరీతంగా సంపాదించేవారు. అయితే అరెస్ట్ కుముందు కోట్లలో ఉన్న నగదును హనీప్రీత్ మాయం చేసినట్లు డేరా బాబాకు చెందిన ముఖ్య అనుచరుడొకరు పోలీసులకు సమాచారం అందించారు. డేరా బాబా అరెస్ట్ అయిన తర్వాత హనీప్రీత్ నాలుగైదు సూట్ కేసుల్లో తన వెంట పెట్టుకుని పరారు కావడంతో పోలీసులు మరింత అనుమానిస్తున్నారు. దాదాపు 36 రోజుల పాటు హనీప్రీత్ పోలీసులకు కళ్లుగప్పి తిరిగింది. దీంతో ఈ డబ్బును హనీప్రీత్ ఎక్కడ పెట్టారన్న దానిపై ప్రస్తుతం హర్యనా పోలీసులువిచారణ చేస్తున్నారు. మొత్తం మీద హనీప్రీత్ ఈ డబ్బును బాబా ముఖ్య అనుచరుల వద్దే పెట్టినట్లు అనుమానిస్తున్నారు.