స్వదేశంలోనే ఉన్న నల్ల కుబేరులకు మోదీ సర్కారు ఓ అద్భుతమైన శుభవార్తను ప్రకటించింది. వారికి తియ్యటి కబురు అందించేలాగా ఆదాయపు పన్ను చట్టాన్ని అడ్డగోలుగా సవరించింది. నల్లధనాన్ని బయటపెట్టుకోవడానికి మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. కొన్ని నెలల కిందట నల్లధనం వెల్లడికి స్వచ్ఛంద పథకం ప్రకటించి.. వెల్లడించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం అంటూ 45 శాతం పెనాల్టీలు విధించిన కేంద్రం.. ఇప్పుడు కేవలం మరో 5 శాతం పెంచి వడ్డిస్తూ.. మొన్నటి పథకానికి లొంగకుండా... విచ్చలవిడిగా ఉన్న నల్లకుబేరులారా.. మీకిదే మహదవకాశం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజాగా చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం.. నల్లధనం ఉన్నవారు ఈ డిసెంబరు 31 వ తేదీలోగా తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకుంటే.. ఆ సొమ్ముకు పన్ను, పెనాల్టీలు అన్నీ కలిపి 50 శాతం ప్రభుత్వం తీసుకుని 50 శాతం మాత్రం యజమానికి అందిస్తుంది. అందులో 25 శాతం వెంటనే వెనక్కు తీసుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 25 శాతాన్ని నాలుగేళ్లు చెల్లుబాటు అయ్యే వడ్డీలేని బాండ్లుగా ఇస్తారు. ఆ నాలుగేళ్ల పాటూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకంలో ఆ నిధులను వాడుకుంటారు.
నిజానికి ఒకసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని పెట్టిన మోదీ సర్కారు అది ముగుస్తున్న సందర్భంలో.. ఇదే ఆఖరు అని.. ఇక ఎలాంటి మినహాయింపులు, కన్సెషన్లు ఉండవని ప్రకటించింది. అలాగే.. నవంబరు 8వ తేదీన నల్లధనం వెలికి తేవడానికి నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత.. మళ్లీ మరో వెసులుబాటు ఇవ్వడం అంటూ జరగదు అని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అయితే మోదీ సర్కారు అనూహ్యంగా తాజా చట్టసవరణ ద్వారా నల్లకుబేరులకు వరం ప్రకటించింది. రెండు నెలల కిందట తమ సొమ్ము బయటపెట్టకుండా దాచుకున్న నల్లకుబేరులకు ఇప్పుడు అదనంగా జరుగుతున్న వడ్డన కేవలం 5 శాతం మాత్రమే. ఆ రకమైన నిబంధనలతో చట్టసవరణ చేయడం చాలా విమర్శలకు గురవుతోంది.
ఐటీ చట్టానికి సవరణ ల విషయంలో లోక్ సభలో పెద్ద ఎత్తున రభస చెలరేగింది. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిందేనని, చర్చకు అవకాశం లేకుండా చేస్తున్నారని, బిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి వ్యవధి కావాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. అయితే వారి అభ్యంతరాలను స్పీకరు తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు వెంటనే ఆమోదం పొందవలసిన అవసరం ఉన్నదంటూ.. స్పీకరు మూజువాణీ ఓటింగ్ చేపట్టి.. బిల్లును ఆమోదింపజేశారు.