ఏపీ ముఖ్యమంత్రి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి, హీరో బాలకృష్ణ కుమార్తె ఇన్ని క్వాలిఫికేషన్లు వున్న బ్రాహ్మిణి సేవా కార్యక్రమాలతో స్పీడ్ పెంచారు. సాధారణంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమాలు చేపట్టినా బాలకృష్ణే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వుండే వారు. కానీ ఈసారి కుమార్తె కు ట్రస్ట్ బాధ్యతలు బాలయ్య అప్పగించారు. రాబోయే ఎన్నికల యుద్ధానికి రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో బ్రాహ్మిణి రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం నడుస్తున్న సమయంలో ఆమె రక్తదాన శిబిరంతో ఎంటర్ అయ్యారు. ఫెస్ బుక్ తో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ను అనుసంధానం చేస్తూ ప్రజలకు మరింతగా సేవలు అందించేలా ఆమె ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కొత్త ప్రయత్నం ఆరంభించారు.
రాంచరణ్ సతీమణి, జగపతి బాబు లతో ప్రచారం ...
బ్రాహ్మణి రక్తదాన శిబిరం ఆషామాషీగా నిర్వహించలేదు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను తీసుకొచ్చారు. అందులో ఒకరు విలక్షణ నటుడు జగపతి బాబు కాగా మరొకరు చిరంజీవి కోడలు హీరో రాంచరణ్ శ్రీమతి ఉపాసన కావడం గమనార్హం. వారితో రక్తదానం ప్రతి ఒక్కరు చేసేలా చక్కటి ప్రచారాన్ని సైతం బ్రాహ్మిణి చేయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి కొందరినైనా బతికించాలని దేవుడు ఎక్కడో లేడని సమయానికి రక్తం అందించే దాతే దేవుడని జగపతి బాబు చక్కని సందేశం ఇచ్చారు. పనిలో పని తన తండ్రికి లెజెండ్ చిత్రంలో అవార్డు రావడం పట్ల బ్రాహ్మిణి బాలయ్యకు శుభాకాంక్షలు సైతం చెప్పేశారు.
లోకేష్ కి అండగా బ్రాహ్మిణి రాజకీయాల్లోకి వస్తారా ?
నారా వారి కోడలు గా నందమూరి అమ్మాయిగా వున్న బ్రహ్మిణి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా ? చేయొచ్చని అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. విద్యావంతురాలు కావడం చక్కటి వాగ్ధాటి బ్రాహ్మిణి సొంతం. భర్త లోకేష్ కి అండగా ఆమె కూడా రాజకీయ అరంగేట్రం చేయొచ్చన్న వాదన వినవస్తుంది. లోకేష్ తో పోలిస్తే ఆమె మాటలకు ప్రసంగాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. కొందరి వాదన అలా ఉంటే మరికొందరు ఆమె నారా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారంటున్నారు. ప్రస్తుతం అత్త భువనేశ్వరి కి హెరిటేజ్ వంటి వ్యాపారాల్లో బ్రాహ్మిణి చేదోడు వాదోడుగా వుంటున్నారు. అనేక కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తే వ్యాపారాలు నమ్మకంగా నడిపే వారు ఎవరన్నది మరికొందరి వాదన గా వినిపిస్తుంది. మొత్తానికి బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది కొద్ది కాలంలో తేలిపోనుంది.