స్టాలిన్ కు కలిసి వచ్చేనా?

Update: 2017-12-04 18:29 GMT

ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఏడాది నుంచి ఆర్కే నగర్ కు ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల21వ తేదీన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ త్రిముఖ పోటీగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడు చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్, శశికళ వర్గం అభ్యర్థిగా దినకరన్, డీఎంకే అభ్యర్థిగా మరదు గణేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ వీరి మధ్యనే ఉంటుందని అందరూ భావించారు. తాజాగా ఈరోజు సినీనటుడు విశాల్ నామినేషన్ వేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసే ముందు కామరాజ్ నాడార్ విగ్రహానికి నివాళులర్పించడం తర్వాత ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద కూడా విశాల్ నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది. జయలలిత ఆశయాలను అమలు చేయడానికే తాను పోటీ చేస్తున్నానని విశాల్ ప్రకటించారు. అంతేకాదు తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శమంటూ చెప్పారు.

విశాల్ రాకతో డీఎంకేకు లాభమా?

అయితే ఆర్కే నగర్ నియోజకవర్గం దాదాపు 18 ఏళ్లుగా అన్నాడీఎంకే కు కంచుకోట. అమ్మ జయలలిత బతికి ఉండగా ఆర్కే నగర్ ను ఆ పార్టీ 1999 నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుస్తూనే ఉంది. ఇప్పుడు అధికార అన్నాడీఎంకే పార్టీ అదే ఆశతో మధుసూదనన్ ను బరిలోకి దించింది. రెండాకుల గుర్తు కూడా వీరికే దక్కడంతో గెలుపు సునాయాసమని భావించారు. అయితే ఇప్పుడు విశాల్ నామినేషన్ వేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశముందంటున్నారు. మరోవైపు దినకరన్ కూడా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చే అవకాశముంది. దీంతో మధుసూదనన్ కు, దినకరన్ కు విజయావకాశాలకు విశాల్ గండికొట్టే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు డీఎంకేలో జోష్ పెరిగింది. డీఎంకేకు కూడా ఆర్కే నగర్ లో స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయినా ఓటు బ్యాంకు మాత్రం డీఎంకేకు చెక్కు చెదరలేదు. ఈ నేపథ్యంలో తమకే లాభమని డీఎంకే వాదిస్తోంది. డీఎంకేకు సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, తమిళ మానిల దేశీయ లీగ్, ఫార్వార్డ్ బ్లాక్, పెరుంతలైవర్ మక్కళ్ కట్చి తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ డీఎంకేను వదిలి అది బయటకు వెళ్లదు. దీంతో కూటమితో ఆర్కే నగర్ ను కొల్లగొట్టాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ భావిస్తున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా ఈఎన్నిక ప్రతిష్టాత్మకమే. ఈ ఎన్నికల్లో ఫలితం తేడా వస్తే తన నాయకత్వంపై ప్రజలు అనుమానించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ న ఆర్కే నగర్ లో స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద విశాల్ నామినేషన్ తో ఆర్కేనగర్ రాజకీయం రసకందాయంలో పడింది.

Similar News