భీమవరం వద్ద ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా రోజులుగా ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా స్థానికులు ఉద్యమిస్తున్నారు. వామపక్షాలు ఇప్పటికే వీరికి మద్దతుగా పోరాటాలు చేసి.. అరెస్టులు కూడా అయ్యారు. లాఠీచార్జీలకు కూడా గురయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటించి, అరెస్టు అయిన వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు.
అయితే ఇప్పుడు ఆ ప్రాంత రైతుల ఉద్యమం రెండో దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. వారు తాజాగా తమకు మద్దతు ఇచ్చి.. పోరాడాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా రైతులతో కలిసి శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో కస్త స్టయిల్ మార్చి.. అక్కడినుంచి తనను కలవడానికి వచ్చిన రైతులతోనే వారి సమస్య గురించి ఎక్కువగా మాట్లాడించారు. వారు చెప్పడం మొత్తం పూర్తయిన తర్వాతే.. పవన్ కల్యాణ్ తాను మాట్లాడారు.
ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...
30 రోజుల నుంచి ఈ చిన్న గ్రామాల్లో 144 వ సెక్షన్ విధించడం ఏంటో తనకు అర్థం కావడం లేదని, అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిందేమీ లేదని, ఈ ఒక ఫ్యాక్టరీ తమకు వద్దని మాత్రమే చెబుతున్నారని దానికి ఇంత దారుణంగా అణచి వేయడం కరెక్టు కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా అనాలోచితంగా ముందుకు వెళితే గనుక.. ఈ సమస్య మరో నందిగ్రామ్ గా మారే ప్రమాదం ఉన్నదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నిజానికి సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడే మాట్లాడాలని అనుకున్నానని, అయితే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నదని భావించడంతో , హైదరాబాదులోనే ప్రెస్ మీట్ పెడుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు.
పారిశ్రామిక ప్రగతికి ఎవరూ అడ్డుగా ఉండకూడదని, అంతమాత్రాన ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చేయకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. సముద్రానికి దగ్గరగా, తీరప్రాంతం వరకు తీసుకెళ్లాలని అందరూ కోరుతున్నారని అలా చేస్తే బాగుంటుందని ఆయన చంద్రబాబును కోరారు.
ప్రజలు చెబుతున్నట్లుగా ఇక్కడ సమస్య ఉన్నదో లేదో అధ్యయనం చేయడానికి, సముద్రానికి దగ్గరగా దీనిని తీసుకెళ్లడానికి గల అవకాశాలు పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన చంద్రబాబును కోరారు. ఇక్కడి ప్రజల మీద ఉన్న బైండ్ ఓవర్ కేసులన్నీ ఎత్తివేయాలని పవన్ కోరారు. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ గంగా ప్రక్షాళనకు నడుం కడుతున్న సమయంలో.. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం వారు గోదావరి కలుషితం చేయడానికి కంకణం కట్టుకోవడం కరక్టు కాదని పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రభుత్వం మొండివైఖరి వహించే పక్షంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.