సోము షౌటింగ్ ఆగ‌లేదుగా.. బాబు గురించి నిజాలు చెప్పారే...!

Update: 2017-12-29 05:30 GMT

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు షాకింగ్ నిజాలు వెల్లడించారు. ప్రత్యేక హోదా విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు నెల‌కొన్న కొన్ని అనుమానాల‌కు ఆయ‌న ఫైర్ అవుతూనే వాస్తవాలు చెప్పేశారు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు బీజేపీ నేత వెంక‌య్య నాయుడు రాజ్యస‌భ‌లో ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అయితే, దీనిని విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చలేదు. అయితే దీనిపై రాజ్యస‌భ‌లో అప్పటి ప్రధాని మన్మోహ‌న్ సింగ్ దీనిపై ప్రక‌ట‌న కూడా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవ‌స‌ర‌మేన‌ని అన్ని వ‌ర్గాలూ చెప్పాయి. యూపీ విప‌క్షం బీఎస్పీ కూడా ఈ విష‌యంలో సానుకూలంగానే స్పందించింది. ఏ నిర్ణయాన్నయినా వ్యతిరేకించే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాద‌వ్ కూడా ఏపీకి హోదా ఇవ్వాల్సిందేన‌ని చెప్పారు. అయితే, ఆ త‌ర్వాత వ‌చ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోదా ఇవ్వలేమ‌ని, 14వ ఆర్థిక సంఘం వ‌ద్దంద‌ని మ‌రో మాట చెప్పింది.

హోదాతో సమానంగా....

దీని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి తెర‌లేపింది. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం ప్రత్యేక హోదా అత్యంత అవ‌స‌ర‌మ‌ని ఆనాడు ప్రక‌టించారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడితో ఆయ‌న హోదా ఏమ‌న్నా సంజీవ‌నా అని ప్రశ్నించారు. దీంతో మొత్తం స్టోరీ రివ‌ర్స్ అయింది. 14వ ఆర్థిక సంఘం చెప్పిన మేర‌కు కేంద్రం హోదా ఇవ్వడం లేద‌ని, హోదాతో స‌మాన‌వైన‌వ‌న్నీ ప్యాకేజీలో ఇస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. అయితే, ఇప్పుడు తాజాగా సోము వీర్రాజు హోదా విష‌యంపై మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన విష‌యాల్లో వాస్తవం లేద‌న్నారు. హోదా విష‌యంలో బాబు నాట‌కం ఆడార‌ని దుయ్యబ‌ట్టారు. హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని చంద్రబాబే అన్నారని స్పష్టం చేశారు.

తామే కరెంట్ ఇస్తున్నాం....

హోదా ఇస్తే ఏటా రూ.3వేల కోట్ల చొప్పున రూ.15వేల కోట్లే వచ్చేవని.. కానీ ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.2లక్షల 10వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ ఉండేది కాదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కరెంట్‌ పోలేదని చెప్పారు. హైదరాబాద్‌ తరహాలోనే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తున్నారని, అలాకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. మొత్తానికి సోము వ్యాఖ్యలు ఇప్పుడు క‌లక‌లం రేపుతున్నాయి. నిజానికి హోదా కోసం ఏపీలోని విప‌క్షం కానీ, చంద్రబాబు మిత్రప‌క్షంగా భావిస్తున్న ప‌వ‌న్ కానీ హోదా కోసం ఉద్యమాల‌కు రెడీ అంటున్నాయి. ఈ త‌రుణంలో బాబు వైఖ‌రిని త‌ప్పు ప‌డుతూ.. సోము చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించ‌నున్నాయన‌డంలో సందేహం లేదు.

Similar News