సోము నోటికి తాళం వేసిందెవరు?

Update: 2018-02-08 09:30 GMT

గత కొద్దిరోజులుగా అధికార తెలుగుదేశం పార్టీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా వ్యక్తిగతంగా విమర్శల దాడి చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నోటికి కళ్లెంపడింది. ఆయన మిత్రపక్షంగా ఉన్న టీడీపీపై అనేక సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారని కూడా ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్రంలో రూలింగ్ జరగడం లేదని... ట్రేడింగ్ జరుగుతుందని సెన్సేషన్ కామెంట్లు చేశారు. దీనిపై టీడీపీ నేతలు సోము వీర్రాజుపై ప్రతి విమర్శలు చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు దానిని నిలుపుదల చేశారు. పార్టీ అధిష్టానమే సోము వీర్రాజును కట్టడి చేయాలని కూడా చంద్రబాబు సూచించారు.

కంటి మీద కునుకులేకుండా....

అయినా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆగలేదు. ఆయన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు నిరసనకు కూడా దిగాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అండదండలతోనే సోము వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వచ్చాయి. సోము వీర్రాజు సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా విన్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, కేంద్రం ఇచ్చే నిధులను కూడా పక్కదారి పట్టిస్తుందని ఆరోపిస్తూ టీడీపీ నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు సోము వీర్రాజు.

షాకు ఫిర్యాదు చేసిన....

అయితే ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా పార్లమెంటును టీడీపీ ఎంపీలు స్థంభింప చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రసంగం రోజున నిరసనలను సభలో ఆపాలని అమిత్ షా చంద్రబాబును కోరారు. అయితే విభజన హామీల అమలుపై స్పష్టత ఇచ్చేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు, అమిత్ షా దృష్టికి సోము వీర్రాజు అంశాన్ని కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాష్ట్ర నేతల పరిస్థితి చూస్తుంటే పొత్తు తెగదెంపులు చేసుకోవాలనే ఉన్నట్లుందని చంద్రబాబు అమిత్ షా ఎదుట అభిప్రాయపడ్డారు.

షా సీరియస్ కావడంతో....

దీంతో అమిత్ షా నేరుగా సోము వీర్రాజుకు ఫోన్ చేసి సీరియస్ అయినట్లు తెలసింది. మిత్రపక్షంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేందుకు అధికారం ఎవరిచ్చారని అమిత్ షా ఒకింత సీరియస్ గానే ప్రశ్నించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల సంగతి తర్వాత చూద్దామని చెప్పినా కూడా టీడీపీపై ఎందుకు విమర్శలు చేస్తున్నావని నిలదీసినట్లు సమాచారం. వ్యక్తిగత అజెండాతో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని షా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీ రాష్ట్ర బీజేపీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోము సంగతి తేల్చేస్తామంటున్నారు బీజేపీలోని ఒక వర్గం నేతలు.

Similar News