సోనియా మళ్లీ రంగంలోకి....!

Update: 2018-01-30 17:30 GMT

పార్టీ పూర్తి బాధ్యతలను తన కుమారుడు రాహుల్ కు అప్పగించి గోవాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సోనియాగాంధీ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఆమె తనయుడిని ముందుంచి వెనక నుంచి కధ నడుపుతున్నారు. సోనియా గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటంతో ఆమె రాజకీయాల్లో్ పాల్గొనలేదు. ఇటీవల జరిగిని ఎన్నికల ప్రచారానికి సయితం ఆమె రాలేదు. కేవలం టెన్ జన్ పథ్ కే సోనియా పరిమితమయ్యారు. గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కూడా సోనియా పాల్గొనలేదు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో్ కూడా రాహుల్ అంతా తానై అయి ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. గెలుపోటములను పక్కన పెడితే రాహుల్ కాంగ్రెస్ పార్టీకి నూతనేత్తేజాన్ని తీసుకువచ్చారనే చెప్పాలి.

రాహుల్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత....

అయితే గుజరాత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాహుల్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. సోనియా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే ఏఐసీసీ వర్గాలు దీన్ని అప్పట్లోనే ఖండించాయి. కాని గత కొద్ది రోజుల నుంచి సోనియా తిరిగి రాజకీయాలపై దృష్టి పెట్టారు. మోడీని ఎదుర్కొనాలంటే విపక్షాలన్నింటినీ సంఘటితం చేయాలన్నది సోనియా ఆలోచన. అయితే రాహుల్ వయసు చిన్నది కావడంతో ఈ బాధ్యతను తానే భుజాన వేసుకున్నారు. సోనియా అన్ని పక్షాల నేతలతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

వారంలో విపక్షాలతో సమావేశం....

ప్రధాని మోడీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా చర్చించారు. తనపైన, ప్రభుత్వంపైన వ్యతిరేకత పెరగక ముందే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నది మోడీ వ్యూహంగా ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించిన విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమయింది. దీంతో సోనియా గాంధీ తమ పార్టీకి చెందిన మిత్రపక్షాలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం సోనియా ఆధ్వర్యంలోనే జరగనుంది. మొత్తం 18 పార్టీలతో సోనియా సమావేశం కానున్నారు. వచ్చే వారం ఈ సమావేశం జరగనుంది. మోడీ విపక్షాలకు తగిన సమయం ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లాలన్న యోచనలో ఉండటంతో సోనియా స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ విపక్షాలన్నీ ఏమేరకు కలసి వస్తాయన్నది వేచి చూడాలి. సీపీఎం కాంగ్రెస్ తో పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా గుజరాత్ లో విడిగానే పోటి చేసింది. ఈ నేపథ్యంలో సోనియా విపక్షాల్లో ఐక్యత తెచ్చేందుకు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Similar News