తన కుమారుడి భవిష్యత్ పై బెంగ ఆమెను వదలనట్లుంది. వరుస పరాజయాలు వస్తుండటంతో ఆమె కలత చెందుతున్నారు. ఇప్పటికే అధికారానికి ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. మరోసారి ఎన్నికల్లో విఫలమయితే మరో ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది. దీంతో పదేళ్లు పూర్తిగా అధికారంలోకి దూరంగా ఉంటే పార్టీ లీడర్లతో కుమారుడికి సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు సోనియాగాంధీ. రాహుల్ ను నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి యూపీఏను మరోసారి అధికారంలోకి తేవాలన్నది సోనియా అభిమతంగా కన్పిస్తోంది.
రాహుల్ కుబాధ్యతలను అప్పగించినా....
అందకోసం సోనియాగాంధీ ఇప్పటికే పార్టీ బాధ్యతలను రాహుల్ కు అప్పగించారు. ఆయన నేతృత్వంలో వెళ్లిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత నిరాశ ఆవరించింది. అలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలను ఎలాగైనా గెలుచుకుని 2019 ఎన్నికలకు ముందు పార్టీలో జోష్ నింపాలన్నది సోనియా ధ్యేయంగా కన్పిస్తుంది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకున్నప్పటికీ ఆమె పార్టీ సీనియర్ నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇటీవల మేఘాలయలో కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే అక్కడకు అహ్మద్ పటేల్ , కమల్ నాధ్ లను హుటాహుటిన పంపింది సోనియాగాంధీయే.
పార్టీకి అవసరమైన సలహాలు....
ఇలా పార్టీకి అవసరమైన సలహాలు క్లిష్ట సమయంలో ఇస్తూనే ఉన్నారు. అయితే మోడీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టడం అంత తేలిక కాదన్నది సోనియాకు తెలుసు. మోడీకి, రాహుల్ కు మధ్య ఎందులోనూ పోలిక లేదు. రాహుల్ రాజకీయాల్లో ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉందని సోనియా గుర్తించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళితే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన సోనియా గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగన ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ నెల 13న విందుభేటీ....
దీంతో సోనియాగాంధీ విపక్షాలన్నింటినీ కలుపుకుని పోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తేనే మోడీని ఎదుర్కొనగలమని విపక్షాలన్నింటికీ సోనియా చెప్పనున్నారు. ఇందుకోసం ఈనెల 13న సోనియా గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు ఆమె తీవ్రంగానే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే విపక్షాలకు చెందిన నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కూడా సోనియా ఫోన్లో మాట్లాడారు. మిగిలిన విపక్ష నేతలందరినీ ఆమే స్వయంగా ఈ విందు సమావేశానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తీసుకొచ్చిన సమయంలో సోనియా ముందుగానే ఈనెల 13న అందరితో విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే వారందరినీ కలుపుకుని పోవాలన్నది ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.