సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు పూర్తిగా స్పష్టత ఇచ్చారు. తనకు కూడా బాస్ రాహుల్ మాత్రమేనని ఆమె చెప్పారు. పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో సోనియాగాంధీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో ఇటీవల ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడు రాహుల్ కు అప్పగించారు. రాహుల్ కు చిన్నవయస్సు కావడం, పార్టీలో సీనియర్లు ఉండటంతో రాహుల్ ఇబ్బంది పడతారని సోనియా ముందుగానే గుర్తించారు. అందుకే రాహుల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్పీకారం చేసే సమయంలో కూడా సీనియర్లు రాహుల్ కు సహకరించాలని కోరారు.
సీనియర్లు గుర్రుగా ఉండటంతో....
అయితే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో రాహుల్ ఇమేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ ఆదరణ పెరుగుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సీనియర్లు మాత్రం రాహుల్ నిర్ణయాలను తప్పుపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా యువనేతలను ప్రోత్సహిస్తూ, సీనియర్ల సలహాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు రాహుల్ పై ఉన్నాయి. పైకి సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతున్నా రాహుల్ బలమైన కోటరీలో చిక్కుకుపోయారని సీనియర్ నేతలు ఆంతరింగిక సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరోక్షంగా సంకేతాలు....
ఈనేపథ్యంలో సోనియా గాంధీ రాహుల్ నాయకత్వం పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చేలా పార్లమెంటు సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఇక నుంచి తనకు కూడా రాహుల్ నాయకుడేనని ఆమె చెప్పారు. అలాగే ఆయన నాయకత్వంలోనే తనతో సహా అందరూ కలిసి నడవాలని కోరారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని పరోక్షంగా ఆమె నేతలకు సూచించినట్లయింది. రాహుల్ నిర్ణయాలపై ఫిర్యాదు చేయాలంటే సోనియాకే చేయాలి. ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా సోనియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, మోడీపైనా, బీజేపీపైనా ప్రజల్లో నమ్మకం పోయిందని సోనియా అభిప్రాయపడ్డారు. తాను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి రాహుల్ వెనకే అందరూ నడవాలన్న సంకేతాలను సోనియా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసమే అందరూ కృషి చేయాలని ఆమె కోరారు.