రెండు రాష్ట్రాల్లో ఉన్న జన'సైన్యం'లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది! చాపకింద నీరులా అలజడి ఇప్పుడిప్పుడే రేగుతోంది. తుఫాను ముందు ప్రశాంతతలా అసంతృప్తి సెగలు.. చినుకు చినుకుగా ప్రారంభమవుతున్నాయి. వీటితోపాటు అందరిలోనూ సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నించడానికే పుట్టిన పార్టీలో ఉన్న సైనికుల్లో.. ఇప్పుడు వీటన్నింటికీ ప్రధాన కారణం.. ఆ సైన్యం దళపతి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి! అవును నిజమే.. జనసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన నాయకుడే.. ఇప్పుడు వీరిలో ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త వారిలో జోష్....
2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీచేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే.. రాజకీయ నాయకులను గందరగోళంలో పడేశారు. అదే సమయంలో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అంతేగాక జనసేనలో చేరాలని సంబరపడ్డారు. కొంతమందిని ఎంపిక చేస్తారని తెలియగానే.. క్యూ కట్టారు. అనేక వడపోతలు నిర్వహించి.. పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు చేసి పార్టీ తరఫున ప్రతినిధులుగా పనిచేయడానికి కొంతమంది సీనియర్లతో పాటు యువతను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేశారు పవన్ కల్యాన్. ఒక్కో ఎంపీ నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ.. ఈ జనసేన దళపతుల నియామకం జరిగింది.
ఏపీలోనూ అంతే....
ఇప్పుడు పవన్ వ్యవహార శైలి, ఆయన పార్టీని నడుపుతున్న తీరు.. విషయాల్లో వీరంతా అసంతృప్తితో ఉంటున్నారని సమాచారం. పవన్ శైలి పార్టీ పుట్టిముంచుతుందని వారు భావిస్తున్నట్లుగా జిల్లాల నుంచి పలువురు పేర్కొంటున్నారు.ముఖ్యంగా సమస్యలపై పవన్ పోరాడుతున్నా.. అదే సమయంలో సీఎంలపై ఆయన ప్రశంసలు కురిపిస్తుండటం వీరిని అయోమయానికి గురిచేస్తోందట. ఇప్పటికే ఏపీలో సీఎం చంద్రబాబుతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఈ అంశాన్నే ప్రతిపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. దీంతోపాటు భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దీంతో జనసేనలోని కొంతమంది ప్రతినిధులు అసంతృప్తికి గురవుతున్నారట.
తెలంగాణ సైనికుల్లోనూ...
ఇక ఇప్పుడ తెలంగాణలోనైనా స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశం దొరికిందని ఆనందపడిన వీరికి ఇక్కడా.. నిరాశే ఎదురైంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్‌కు వెళ్లారు పవన్! అంతేగాక 24 గంటలు విద్యుత్ ఇస్తున్నందుకు ప్రశంసలు కూడా కురిపించారు. కేసీఆర్ పాలనను కేస్ స్టడీలాగా తీసుకుని.. ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు జనసేన ప్రతినిధులుగా ఎంపీ నియోజకవర్గ స్థాయిలో నియమితులైన వారికి మింగుడు పటడం లేదు. అధికారంలో ఉన్న పార్టీలను పొగుడుకుంటూ ఉంటే.. క్షేత్రస్థాయిలో ఆ ప్రభుత్వాలపై తాము పోరాడేదెలా అని, ప్రజల్లోకి వెళ్లి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అని వారు ప్రశ్నిస్తున్నారట.