యువతలో సెల్ఫీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది. సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వాట్స్ అప్ స్టేటస్ కోసం తీసుకుంటున్న సమయం లో ఈ సంఘటన జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు సెల్ఫీ పిచ్చితో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎంఎంటీఎస్ రైలు వేగంగా దూసుకొస్తుండగా...ఓ యువకుడు పట్టాల పక్కన నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు...ఆ యువకుడిని ఢీకొట్టడంతో కొన్ని మీటర్ల దూరంలో కుప్పకూలాడు. ఈ మొత్తం వ్యవహారం అతని మొబైల్‌లో రికార్డుకాగా...ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యువకుడు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడిని లింగంపల్లి ఆస్పత్రికి తరలించగా...అక్కడ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుడిని శివగా పోలీసులు గుర్తించారు. శివ తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని రైల్వే ఎస్పీ మీడియాకు తెలిపారు. వరంగల్ కు చెందిన శివ తన బావ ఇంటికి వచ్చాడు. భరత్ నగర్ రైల్వే స్టేషన్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకుంటానని చెప్పి రైల్వే స్టేషన్ బయటపట్టాల పైకి వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సమయం లో లోకల్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది.