సెంచరీలు కొట్టిన సచిన్ మైకు అందుకున్నా...?

Update: 2017-12-21 18:29 GMT

పాపం..సచిన్ క్రీడా మైదానంలో సెంచరీలు దంచి కొట్టి... పరుగులు వరద పారించి కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన సచిన టెండూల్కర్ పెద్దల సభలో మాత్రం సచిన్ కు చుక్కెదురయింది. ఆయన ఈరోజు రాజ్యసభలో ప్రసంగించలేకపోయారు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడు. ఆయన రాజ్యసభకు కొంతకాలంగా క్రమం తప్పకుండా వస్తున్నారు. ఆయన కు చాలారోజులకు ఛాన్స్ వచ్చింది. క్రీడారంగంపై మాట్లాడేందుకు మైకు అందుకున్న సచిన్ కు ఆ అవకాశం దక్కకుండా పోయింది. సభలో తొలిసారి ప్రసంగించాలనుకున్న సచిన్ కు నిరాశే ఎదురయింది.

కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో...

గురువారం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత క్రీడారంగంపై ప్రసంగించాలని జగన్ మైకందుకున్నారు. ఛైర్మన్ స్థానంలో ఉన్న వెంకయ్య నాయుడు కూడా అనుమతివ్వడంతో సచిన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే విపక్షాలు మాత్రం సచిన్ కు ఆ అవకాశం ఇవ్వలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగాయి. పెద్దపెట్టున నినాదాలు చేశాయి. మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినదించాయి. సచిన్ మాత్రం మైకు పట్టుకుని నవ్వుతూ నిల్చుండి పోయారు.

వెంకయ్య ఎంత నచ్చ జెప్పినా....

ప్రధాని రాజ్యసభకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ పెద్దయెత్తున నినాదాలు చేయడంతో సచిన్ కు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పదే పదే విజ్ఞప్తి చేశారు. భారత రత్న అవార్డు గ్రహీతను గౌరవించాలని, సచిన్ కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని వెంకయ్య పదే పదే కోరినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు కూడా చాలా సేపు నిలిపివేశారు. ఎంతకూ గొడవ సద్దు మణగక పోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. సచన్ ప్రసంగించకుండానే సభ రేపటికి వాయిదా పడింది.

Similar News