సీమలో సీన్ ఇలా

Update: 2018-02-27 20:30 GMT

సీమకు అంటుకుంది. స్వచ్ఛందంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుని వీధిపోరాటాలకు దిగుతున్నారు. అభివృద్ధి మొత్తం అమరావతికే పరిమితమవుతుందన్న కారణంతో సీమ వాసులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అనేక వర్గాలు ఉద్యమ బాట పడుతున్నాయి. గత వారం రోజుల నుంచి రాయలసీమలో ఇదే సీన్ నడుస్తోంది. రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా ప్రబలడంతో విద్యార్థులు, న్యాయవాదుల పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగ తరలి వస్తున్నారు.

హైకోర్టు కర్నూలులోనే.....

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం రాయలసీమ వాసులకు మింగుడుపడటం లేదు. గత రెండు నెలలుగా సీమ ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. కోర్టులను బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు చేయాలన్న తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలన్నది వారి వాదన. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా చేతులు కలిపాయి. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఉద్యమానికి మద్దతునిచ్చాయి.

కొత్తగా గుంతకల్లు జోన్....

న్యాయవాదుల పోరాటానికి విద్యార్థులు కూడా సంఘీభావం ప్రకటించారు. దీంతో పాటు కొత్త గుంతకల్లు జోన్ నినాదం ఊపందుకుంది. గుంతకల్లు రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. విశాఖ రైల్వే జోన్ కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారని, సీమ విషయాన్ని పక్కన పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గుంతకల్లు ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పోస్టుకార్డుల ద్వారా తమ డిమాండ్ ను తెలియజేస్తున్నారు. ప్రతి విద్యాసంస్థల్లో కరపత్రాలు పంపిణీ చేసి సీమకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థి సంఘ నేతలు వివరిస్తున్నారు. అలాగే వేదావతి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని రాయలసీమ వాసులు ఆందోళన బాట పట్టారు. ఇందుకోసం రాయలసీమ విద్యార్థి సంఘం ఏర్పడి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, కర్నూలులో హైకోర్టు, గుంతకల్లు రైల్వేజోన్ లు ప్రధాన డిమాండ్లుగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఇది చంద్రబాబుకు కొత్త సమస్య కానుంది. సీమ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నానని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు వీరి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.

Similar News