సీమలో జగన్ సందడి ఇలా?

Update: 2017-10-26 00:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ దాదాపు ఖరారయింది. నవంబరు 3వ తేదీన జగన్ తిరుమల వెళ్లనున్నారు. తిరుమలలో ఆరోజు రాత్రి బస చేస్తారు. 4వ తేదీన శ్రీవారిని దర్శించుకుంటారు. అదేరోజు జగన్ కడపకు బయలుదేరి వెళ్లి అక్కడ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. అదే రోజు రాత్రి పులివెందులకు చేరుకుంటారు. ఆదివారం పులివెందులలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇడుపులపాయ బయలుదేరి వెళతారు. రాత్రికి ఇడుపులపాయలోనే ఉంగారు. 6వ తేదీ ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 11 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కడప జిల్లాలో సాగుతుంది.

నాలుగు జిల్లాల్లో...770 కిలోమీటర్లు....

కడప జిల్లాలో మొత్తం 8 రోజుల పాటు జగన్ పాదయాత్ర చేయనున్నారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. కడప జిల్లాలో మొత్తం 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. రోజుకు పదిహేను కిలోమీటర్ల వంతున జగన్ పాదయాత్ర చేయనున్నారు. కడప జిల్లాలో అనంతరం చాగలమర్రి వద్ద జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నవంబర్ 14వ తేదీన కర్నూలు జిల్లాలోకి జగన్ రానున్నారు. ఇక్కడ ఆళ్లగడ్డ, బనగానపల్లి, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతానికి నాలుగు నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైనా ఇది మారే అవకాశముంది. కర్నూలు జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ కనీసం 9 నియోజకవర్గాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన నాలుగు నియోజకవర్గాల్లో పర్యటనకు 13 రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు. ఇక కర్నూులు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే జగన్ ఏడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందుకు మొత్తం 20 రోజుల సమయం పట్టే అవకాశముంది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో 200 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. ఇక అనంతపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుజిల్లాలో దాదాపు 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మొత్తం 250 కిలోమీటర్ల పాదయాత్ర చేపడతారు. అయితే ఇందులో కొన్ని మార్పులు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన కొన్ని నియోజకవర్గాలకే కాకుండా మరికొన్ని నియోజకవర్గాలకు జగన్ పాదయాత్ర వెళ్లే అవకాశం ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ రాయలసీమలో ఇలా సాగుతుంది.

Similar News