దేశ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో పరిణామాలు ఎలా వున్నా టిడిపి కాంగ్రెస్ జతకట్టకుండా ఉండేందుకు ప్రధాని మోడీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ తగ్గితే ఇప్పుడు తమతో వున్న టిడిపి మిత్రపక్షం యుపిఎ తో కానీ మూడో ఫ్రంట్ ఏర్పాటుకు రంగంలోకి దిగుతుందని మోడీ గ్రహించారు. ఆ పార్టీ ఎటు పోకుండా ఉండేలా పార్లమెంట్ వేదికగా విభజన పాపం మొత్తం కాంగ్రెస్ దే అని తేల్చారు. ఇదే విషయాన్నీ చంద్రబాబు సైతం పదే పదే చెబుతారు. అలాగే గతంలో అంజయ్య కు ముఖ్యమంత్రిగా రాజీవ్ గాంధీ చేసిన అవమానం చూసి చలించిన ఎన్టీఆర్ టిడిపి పార్టీని పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి ఓడించిందని అలాంటి పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం ఏమిటంటూ ఇటు టిడిపి కాంగ్రెస్ లు భవిష్యత్తులో దగ్గర అయినా ప్రజలు చీదరించుకునే పరిస్థితి ని ముందే ఏర్పరిచారు మోడీ.
ఏపీ నిధులపై హామీ లేకపోగా ...
గత మూడు రోజులుగా టిడిపి, వైసిపి ఎంపీల ఆందోళనతో ప్రధాని దిగివచ్చి ఏదో హామీ ఇస్తారనుకుంటే సీన్ మొత్తం రివర్స్ చేశారు మోడీ. ఆయన ప్రసంగం మొత్తం రాజకీయం గా సాగితే ఏపీ అంశంలో కూడా టిడిపి పై మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు ప్రధాని. విభజన హామీలు, ప్యాకేజీ అంశాలు ఏదో ఒకరకంగా ప్రధాని ప్రస్తావిస్తారనుకున్న వారికి నిరాశే ఎదురైంది. అవన్నీ వదిలి మోడీ ఏపీ రాజకీయాలనే ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ దుస్థితి కి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ అన్ని సమస్యలకు మూలం వారే అన్నది చెప్పడం టిడిపి కు మింగుడు పడటం లేదు. ఉభయ సభల్లోనూ ప్రధాని ఏపీ పోరాటం పై కించిత్ ప్రస్తావించక పోవడాన్ని ఏ ఒక్కరూ అర్ధం చేసుకోలేకపోతున్నారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు మోడీ తన స్టైల్ లో సాగిపోయారు తప్ప టిడిపి చేస్తున్న పోరాటాన్ని కానీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపి పోరాటాన్ని డోంట్ కేర్ అన్నట్లే ప్రవర్తించి విమర్శల పాలయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.