ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని ఈ జిల్లా సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. లోకేష్ యువకుడు కావడంతో ఎక్కువగా యువకులను, డబ్బులున్న వారినే పార్టీలోకి చేరదీస్తున్నారని, వారికి పదవులను పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్లను పక్కన పెట్టి లోకేష్ ఆడుతున్న ఆట... వచ్చే ఎన్నికల్లో వికటిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వైరివర్గాలతో చేతులు కలిపేదెలా?
ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేత కరణం బలరాంకు చినబాబు చుక్కలు చూపించారు. అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి తీసుకొచ్చిన లొకేష్ అద్దంకి నియోజకవర్గ బాధ్యతల నుంచి తన కుమారుడు వెంకటేశ్ ను తప్పించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన దానికి ఇదే ప్రతిఫలమా? అని ఆయన ఇన్ ఛార్జి మంత్రి సునీతను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాగైతే వచ్చే ఎన్నికల నాటికి తమ దారి తాము చూసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారట. అంతేకాదు అద్దంకి తన కార్యకర్తలెవరూ గొట్టిపాటికి పనిచేయబోరని కూడా తేల్చిచెప్పారట. అలాగే కందుకూరు నియోజకవర్గం పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక్కడ దివిశివరామ్ పార్టీలో సీనియర్. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోతుల రామారావుపై ఓడిపోయారు. అయితే పోతుల రామారావును కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కకుంటే తాను పోతులకు పనిచేయనని దివి శివరామ్ ఖరాఖండిగా చెబుతున్నారు. తాను ఇంతకాలం పార్టీకి సేవచేసినా కనీసం ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఇలా సీనియర్లు లోకేష్ దెబ్బకు కకావికలం అయిపోతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తమ విషయాన్ని చంద్రబాబు వద్దనే తేల్చుకుంటామంటున్నారు.